Congress | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఢిల్లీ దూత, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తొమ్మిది నెలల పాటు చేసిన కష్టం బుట్టదాఖలైందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తొలి గుర్తింపు అని పాదయాత్రలో ఆమె ఇచ్చిన హామీ ఉత్త ముచ్చటే అయ్యిందా? డీసీసీ అధ్యక్షుల ఎంపికలో మీనాక్షి చేసిన సిఫారసులు, చెప్పిన మాటలు చెల్లుబాటు కాలేదా? ఆఖరి నిమిషంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోడ్పాటుతో సీఎం రేవంత్‌రెడ్డి చక్రం తిప్పారా? కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించినట్టు అసలు కాంగ్రెస్ కార్యకర్తలకు గుర్తింపు లేదా? రేవంత్ అసలు కాంగ్రెస్ నేతలను పక్కకునెట్టి తన వర్గం నేతలకు పార్టీ జిల్లా బాధ్యతలు అప్పగించారా? అందుకే డీసీసీ అధ్యక్షుల నియామకంపై జిల్లాల్లో కాంగ్రెస్ సీనియర్ నేతలు తిరగబడుతున్నారా? అంటే కాంగ్రెస్ శ్రేణులు ‘అవును’ అనే అంటున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్‌లో జిల్లా అధ్యక్షుల ప్రకటన అగ్గికి ఆజ్యం పోసింది. డీసీసీ పీఠం ఆశించి భంగపడ్డ నేతలంతా పార్టీ ముఖ్యనేతల తీరుపై తిరుగుబాటు చేస్తున్నారు. ‘పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న మాకు ఇదా మీరిచ్చే గౌరవం?’ అంటూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వకుండా, కులసమీకరణ సమతులనం లేకుండా డీసీసీ పదవులు కేటాయించారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దక్షిణ తెలంగాణలో పట్టున్న ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గానికి, ఉత్తర తెలంగాణలో వెలమ సామాజికవర్గానికి ఒక డీసీసీ కూడా దకకపోవడంపై చర్చ జరుగుతున్నది. గతంలో వరంగల్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు వెలమ సామాజికవర్గానికి చెందినవారు ఉండేవారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఉండేది. ఈసారి ఒక డీసీసీ పీఠం కూడా వెలమ వర్గానికి దకకపోవడంతో ఆ సామాజిక వర్గం నేతలు రగిలిపోతున్నారు.
మేడం సిఫారసులు బేఖాతరు
ఆగస్టులో జనహిత పేరిట పాదయాత్ర చేపట్టిన మీనాక్షీ నటరాజన్, క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయాలను సేకరించి నివేదికలు రూపొందించారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జిల్లాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులతో భేటీ అయ్యారు. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన నేతల వివరాలు సేకరించారు. ఏఐసీసీ అబ్జర్వర్లను తెలంగాణకు రప్పించి క్షేత్రస్థాయి పరిశీలన చేయించారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని, టీపీసీసీ అధ్యక్షుడితో కలిసి డీసీసీ అధ్యక్ష పదవికి అర్హులైన అభ్యర్థుల జాబితాను రూపొందించినట్టు తెలిసింది. ప్రతిపోస్టుకూ ఇద్దరు నేతలను సిఫారసు చేస్తూ ఆమె ఏఐసీసీకి నివేదిక పంపినట్టు తెలిసింది. ఆమె సిఫారసు చేసిన పేర్లలో 90 శాతం మందికి డీసీసీ అధ్యక్ష పదవి రాలేదని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
చివరి నిమిషంలో సీఎం రేవంత్రంగ ప్రవేశం చేసి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తోడ్పాటుతో తన వర్గం నేతలకే పదవులు ఇప్పించుకున్నట్టు తెలిసింది. ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ డీసీసీల ఎంపిక కోసం మొదట్లో పెట్టిన రూల్స్ బ్రేక్ అయ్యాయి. ఒక పోస్టుకు ఒకరే ఉండాలని చెప్తే.. ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు, 12 మంది పార్టీ వైస్ ప్రెసిడెంట్లకు డీసీసీల్లో చోటు కల్పించారు. గతంలో అధ్యక్షులుగా చేసినవారు స్వచ్ఛందంగా తప్పుకోవాలనే నిబంధన పెట్టినా నాగర్‌కర్నూల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న వంశీకృష్ణకే మళ్లీ అవకాశమిచ్చారు. డీసీసీలుగా ఉన్న వారి కు టుంబ సభ్యులకు నో చాన్స్ అని చెప్పారు. సి ద్దిపేట డీసీసీ పోస్ట్‌ను ఇప్పటివరకున్న అధ్యక్షుడు నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డికి ఇచ్చారు.
కొత్త అధ్యక్షుడిపై మంత్రి ఫిర్యాదు
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకంతో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. పున్నా కైలాశ్ నేతకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. తనను, తన కుటుంబసభ్యులను కైలాశ్ అసభ్య పదజాలంతో దూషించారని నల్లగొండ పోలీసులకు మంత్రి ఫిర్యాదు చేశారు. అతడిని తక్షణం పదవి నుంచి తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. ఇదే లేఖను మంత్రి కార్యాలయం మీడియాకు పంపింది. డీసీసీ పదవి ఆశించి భంగపడిన గుమ్మల మోహన్‌రెడ్డి సీఎం రేవంత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్‌రెడ్డి నమ్మించి తన గొంతు కోశారని ఆవేదన వ్యక్తంచేశారు. తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడినైనందుకే డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వలేదని ఆరోపించారు. తన కులం, సీనియార్టీ, కాంగ్రెస్ పార్టీ కోసం తాను చేసిన సేవలు పరిగణనలోకి తీసుకోలేదని వాపోయారు. పున్నా కైలాశ్‌ను తొలిగించేదాకా తాము కార్యాచరణ చేపడుతామని కోమటిరెడ్డి వర్గీయులు ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఒక్క ఇల్లు, రెండు పదవులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్ డీసీసీల ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి ఆశించారు. వీరిద్దరికీ కాకుండా కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న లకావత్ ధన్వంతికి జనగామ డీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వడంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి ధన్వంతి భర్త డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ టీపీసీసీ సభ్యుడిగా ఉన్నారు. మహబూబాబాద్ డీసీసీ ఆశించిన వెన్నం శ్రీకాంత్‌రెడ్డికి కాకుండా మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ భార్య భూక్యా ఉమకు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడంపై వెన్నం వర్గం రగిలిపోతున్నది. ఒకే ఇంట్లో రెండు పదవులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా మంత్రి చెప్పినా ఫలితం లేదు?
కరీంనగర్ డీసీసీ పదవిని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ ఆశించారు. కానీ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు డీసీసీ పోస్ట్ ఇచ్చారు. రాజేందర్‌కు డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని స్వయంగా మంత్రి సిఫారసు చేసినా సీఎం పట్టించుకోనట్టు తెలిసింది. ఎమ్మెల్యేలకు డీసీసీలుగా అవకాశం ఇవ్వబోమని చెప్పి ఇప్పుడు ఎలా ఇచ్చారు? అని రాజేందర్ ప్రశ్నిస్తున్నారు.
జగిత్యాల డీసీసీ పోస్ట్‌ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ తనవర్గానికి ఇప్పించుకోవాలనుకున్నారు. తన మద్దతు కూడా జువ్వాడి నర్సింగారావుకు ప్రకటించారు. కానీ మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తన సీనియార్టీ అంతా ఉపయోగించి తన అనుచరుడు నందయ్యకు ఇప్పించుకున్నారు. దీంతో అటు సంజయ్.. ఇటు జువ్వాడి ఇద్దరూ అలిగినట్టు ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ నుంచి ఫిరాయించి వచ్చిన తనకు కాంగ్రెస్ ఏం గుర్తింపు ఇచ్చినట్టని పీసీసీ పెద్దల దగ్గర ఎమ్మెల్యే సంజయ్ ఊగిపోయినట్టు తెలిసింది.
సిద్దిపేటలో ‘ఆపరేషన్ ఏ ఫామ్’
సిద్దిపేట డీసీసీ పదవి ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డికి ఇచ్చారు. ఆమెను మైనంపల్లి హన్మంతరావు, తాడూరి శ్రీనివాస్‌గౌడ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. సిద్దిపేట జిల్లాలో 126 మంది దరఖాస్తు చేసుకున్నా మైనంపల్లి హన్మంతరావు వర్గీయుడు దర్పల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్‌గౌడ్, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అనుచరుడిగా గుర్తింపు ఉన్న ఇమామ్ హత్తు తదితరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. తన వర్గీయుడికి డీసీసీ పదవి ఇప్పించుకునేందుకు చివరిదాకా ప్రయత్నం చేసిన మైనంపల్లి హన్మంతరావు విఫలమైనట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు సిద్దిపేట నుంచి గాంధీభవన్ వరకు మహార్యాలీకి రూపకల్పన చేస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు వారు ‘ఆపరేషన్ ఏ ఫామ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది.
ఆ ఎమ్మెల్యేల అసంతృప్తి
డీసీసీ అధ్యక్ష పదవి దకిన వారిలో కొందరు అసంతృప్తితో ఉన్నారు. యాదవ, కురుమ కోటాలో మంత్రి పదవి ఆశించిన బీర్ల ఐలయ్యకు భువనగిరి డీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఇప్పటికే ఆయన విప్‌గా ఉన్నారు. డీసీసీ అధ్యక్ష పదవితో ఆయనకు మూడో పదవి వచ్చినట్టయింది. బీర్ల ఐలయ్య అసంతృప్తితోనే ఉన్నారని అనుచరులు చెప్తున్నారు. దరఖాస్తు చేసుకోకుండానే పదవి ఇవ్వడంపై అసహనంతో ఉన్నట్టు తెలిసింది. తనను జిల్లాకే పరిమితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం. మరో ఎమ్మెల్యే మకా న్సింగ్ రాజ్ ఠాకూర్ కూడా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంబీసీ ఎమ్మెల్యేల్లో ఒకడినే ఉన్నానని, మంత్రివర్గంలో చోటు కల్పించాలని కో రుతుంటే మరోసారి పెద్దపల్లి జిల్లాకే అధ్యక్షుడిగా ఎంపిక చేశారని నిరాశలో ఉన్నట్టు తెలిసింది.
చిన్న జిల్లాలో పెద్ద రాజకీయం
అతిచిన్న జిల్లా వనపర్తిలో పెద్ద రాజకీయమే నడిచిందంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు! ఇక్కడ డీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించుకోవడానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పోటాపోటీగా ప్రయత్నించారు. డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ యాదవ్ తనను మరోసారి కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్నారు. మేఘారెడ్డి వర్గానికి చెందిన సాయి చరణ్, సత్యశీలారెడ్డి, సతీష్, వెంకటేశ్, కిచ్చారెడ్డి, చిన్నారెడ్డి వర్గంలో రాజేంద్రప్రసాద్, కిరణ్ తదితరులు డీసీసీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కానీ అనూహ్యంగా దరఖాస్తు కూడా చేయని శివసేనారెడ్డికి వనపర్తి జిల్లా పగ్గాలు కట్టబెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది రేవంత్‌రెడ్డి మార్కు రాజకీయమని స్థానిక నేతలు చెప్తున్నారు.
అందుకోసమే జగ్గారెడ్డి డ్రామానట!
ఉమ్మడి మెదక్ జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు దామోదర్ వర్సెస్ జగ్గారెడ్డి అన్నట్టుగా సాగిందని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలతో సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి ఎంపిక ఆగిపోయినట్టు తెలిసింది. మంత్రి దామోదర రాజనర్సింహ తన వర్గానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసినట్టు సమాచారం. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన వర్గానికి చెందిన ఉజ్వల్ రెడ్డికే ఇవ్వాలని, అది సాధ్యం కాకపోతే ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న తన భార్య నిర్మలనే కొనసాగించాలని పట్టుబట్టినట్టు తెలిసింది. మరోవైపు సిద్దిపేట జిల్లాకు సంబంధించి తన అనుచరుడిగా ఉన్న ఇమామ్ హత్తుకు డీసీసీ ఇవ్వాలని జగ్గారెడ్డి ఢిల్లీ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేసినట్టు సమాచారం.
అయితే తన అనుచరుడిని కాదని సిద్దిపేటలో నర్సారెడ్డి కూతురు ఆంక్షారెడ్డికి ఇవ్వడం, సంగారెడ్డి ఎంపిక పెండింగ్‌లో పెట్టడంతో తాను రాహుల్‌గాంధీ, రేవంత్చెప్పినా ఇక సంగారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను అని శపథం చేస్తూ ప్రకటన చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. కానీ ఆయన ప్రత్యర్థి వర్గాలు మాత్రం మరో తీరుగా చెప్తున్నారు. పునర్విభజనలో సంగారెడ్డి, సదాశివపేట వేర్వేరు నియోజకవర్గాలుగా అవతరిస్తాయని, సంగారెడ్డిని తన భార్యకు అప్పగించి, సదాశివపేట నుంచి ఆయన పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారని, ఈ ముందస్తు వ్యూహంతోనే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి దామోదర సన్నిహితులు చెప్తున్నారు.