మానవపాడు, ఏప్రిల్ 21 : జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలో అకాల వర్షానికి పూర్తిగా తడిచిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం కురిసిన వానతో కల్లాల్లో ఆరబోసిన మిరప, పొగాకు పంటలు తడిసి ముద్దయ్యాయి. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే సోమవారం గ్రామానికి వెళ్లి నీటిపాలైన పంటను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు పెద్ద ఎత్తున పంటలను కోల్పోయారని, పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని భరోసానిచ్చారు.
పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లి ఇద్దరు రైతుల మృతి
ధర్మపురి/మహాముత్తారం, ఏప్రిల్ 21 : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ ఇద్దరు రైతులు మృతిచెందారు. జగిత్యాల జిల్లాలో కరెంట్ షాక్‌తో ఒకరు, భూపాలపల్లి జిల్లాలో పాముకాటుకు ఇంకొకరు మరణించారు. వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్‌కు చెందిన రైతు గోవిందుల మల్లేశం (58) సోమవారం ఉదయం తన పొలానికి సాగు నీరు పెట్టడానికి వెళ్లాడు. అక్కడ మోటర్ స్విచ్చ్బోర్డు ఆన్ చేస్తుండగా.. కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటకు చెందిన చిడం లక్ష్మయ్య (67) ఆదివారం గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లాడు. కరెంటు మోటర్ ద్వారా పొలానికి నీళ్లు పెట్టే క్రమంలో పాము కాటు వేసింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే భూపాలపల్లి దవాఖానకు తరలించారు. అనంతరం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా సోమవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.