హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : వచ్చే వారం రోజుల పాటు (19వ తేదీవరకు) రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వచ్చే ఐదు రోజులు వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. గత ఆదివారం తూర్పు మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9కి.మీ.ల ఎత్తులో కొనసాగిన ద్రోణి సోమవారం బలహీనపడిందని, ఫలితంగా తెలంగాణలో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టాయి. సోమవారం రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37.8 డిగ్రీలు, కనిష్ఠం 23.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 62శాతం, వర్షపాతం 0.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. సోమవారం హన్మకొండ జిల్లాలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షం కురవగా, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో అక్కడడక్కడా భారీ వర్షం పడింది. మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసింది.