హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకత్వం తీరుపై ఆ పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను, వైఫల్యాలను ఎత్తిచూపడంలో వామపక్ష నేతలు మెతక వైఖరి చూపుతున్నారని కార్యకర్తలు భావిస్తున్నారు. ఈ వైఖరితో కమ్యూనిస్టులు ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటున్నారనే సందేశం ప్రజల్లోకి వెళుతున్నదని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమాలు నిర్మించడంలో నాయకత్వం విఫలమైందంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో కమ్యూనిస్టులకు అసెంబ్లీ, పార్లమెంటులో సీట్లు లేకున్నా.. ప్రజా సమస్యలపై పోరాడుతూ.. అండగా ఉంటారనే నమ్మకం ప్రజల్లో ఉందేది.
కానీ ఇటీవల ప్రభుత్వ తప్పుడు విధానాలను సమర్ధించే విషయంలో అధికార పార్టీ నేతల కంటే వామపక్ష నేతలే ముందుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి బదులు.. గత ప్రభుత్వ విధానాల వల్లనే రేవంత్ సర్కారు ఏమీ చేయలేకపోతున్నదన్న లెఫ్ట్ నేతల వ్యాఖ్యలపై శ్రేణులు మండిపడుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పడి 18నెలలు పూర్తవుతున్నా.. పేదలకు ఆసరా పింఛన్ల పెంపు, ఇందిరమ్మ గృహాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, గురుకుల పాఠశాలల్లో సమస్యలు, పేదలకు ఇండ్ల పట్టాల పంపిణీ, ఉద్యోగాల భర్తీ, కులవృత్తులకు ప్రోత్సాహం వంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఫోర్త్ సిటీ పేరుతో పెద్ద ఎత్తున వేల ఎకరాల పేదల భూములను ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. భూములు ఇవ్వడానికి అంగీకరించని రైతులను బలవంతంగా ఖాళీ చేయించి జైల్లో పెడుతున్నది. ఇలాంటి బాధితులకు అండగా ఉండాల్సిన వామపక్ష పార్టీలు స్పందించడం లేదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది.
సీపీఐ మరింత దారుణం..
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో సీపీఎంతో పోలిస్తే సీపీఐ తీరు మరింత దారుణంగా ఉన్నదని ఆ పార్టీ నేతలు, క్యాడర్ వాపోతున్నారు. ఇటీవల కంచ గచ్చిబౌలి, లగచర్ల భూముల విషయంలో సీపీఎం దాని అనుబంధ సంఘాలు కొంతవరకు ఆందోళనలు చేపట్టాయి. కానీ సీపీఐ నేతలు మాత్రం కేవలం వినతిపత్రాలు, పత్రిక ప్రకటనలకే పరిమితమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సింగరేణి, ఆర్టీసీ కార్మికుల సమస్యల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో పూర్తిగా విఫలమయ్యామని ఆ పార్టీ కార్మిక సంఘాల నేతలే అంగీకరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ బలపడకుండా లౌకిక పార్టీలకు మద్దతు ఇవ్వడంలో తప్పులేదని.. కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వం చేసే తప్పులను వెనుకేసుకురావడమేమిటని వాపోతున్నారు.
స్థానిక ఎన్నికల్లో భిన్న పరిస్థితులు..
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే స్థానిక ఎన్నికల్లో చాలా తేడా ఉంటుందని క్షేత్రస్థాయి నాయకత్వం అభిప్రాయపడుతున్నది. స్థానిక సమస్యల ఆధారంగా జరిగే ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కమ్యూనిస్టులకు సహకరించే పరిస్థితి లేదని ఇప్పటికే రాష్ట్ర నాయకత్వాలకు డివిజన్‌స్థాయి క్యాడర్ స్పష్టం చేసింది. పార్టీని పటిష్ఠం చేయడం కోసం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని రాష్ట్ర నాయకత్వాలపై జిల్లా, డివిజన్ కమిటీలు ఒత్తిడి చేస్తున్నాయి. క్యాడర్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర నాయకత్వం నడుచుకుంటేనే పార్టీకి మనుగడ ఉంటుందని పార్టీవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.