CM KCR | ‘ఇందిరమ్మ రాజ్యంలోనే మనోళ్లను కాల్చి చంపారు. ఇందిరమ్మ రాజ్యంలోనే ఎన్కౌంటర్లు అయినయ్. ఇందిరమ్మ రాజ్యంలోనే రక్తపాతమైంది. మతకల్లోలాలు హైదరాబాద్‌లో జరిగినయ్. మళ్లీ ఇందిరమ్మ రాజ్యం తెస్తమని ఈ కాంగ్రెసోళ్లు మాట్లాడుతున్నరు’ అంటూ సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. మర్రి జనార్దన్‌రెడ్డిని భారీ మెజారిటీతో ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్ ప్రజలు కట్టిన డబ్బులతో రైతుబంధు ఇచ్చి వేస్ట్ చేస్తున్నడని మాట్లాడుతున్నరు. రైతుబంధు ఉండాలంటే నాగర్ కర్నూల్లో మర్రి జనార్దన్‌రెడ్డిని గెలిపించాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి గెలిస్తే బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. వేరేవాళ్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ వస్తుంది. కాబట్టి ప్రజలు దీర్ఘంగా ఆలోచన చేయాలి’ అని పిలుపునిచ్చారు.
‘పీసీసీ అధ్యక్షుడు కరెంటు 24గంటలు వద్దు మూడుగంటలు చాలు అంటున్నడు. అవసరమే లేదు.. మూడుగంటలకు మూడెకరాల పొలం పారుతుంది వద్దు అంటడు. రైతులు 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలంటున్నడు. పదేళ్ల నుంచి కష్టపడ్డాం. భారతదేశంలో 24గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చేది తెలంగాణ ఏకైక రాష్ట్రం. గవర్నమెంట్ వస్తే ధరణిని తీసి బంగాళాఖాతంలో వేస్తామని రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క, పీసీసీ ప్రెసిడెంట్ అంటున్నరు. గర్నమెంట్ దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మీకు అప్పగించింది. మీ భూమిపై హక్కు మారాలంటే మీ బొటనవేలు పెడితనే మారుతుంది. మీ భూమిని మార్చే అధికారం ముఖ్యమంత్రికి లేదు. అదే మీకు ఇచ్చిన అధికారం. ఇంతకు ముందు గవర్నమెంట్ దగ్గర ఉంటే రైతులకు ఇచ్చాం. ఆ అధికారాన్ని ఉంచుకుంటరా.. పోడగొట్టుకుంటరా మీరే ఆలోచించుకోవాలి’ అన్నారు.
‘రైతుబంధు, రైతుబీమా, వడ్లు అమ్మిన డబ్బులు ఎట్ల వస్తున్నయ్. హైదరాబాద్‌లో డబ్బులు వేస్తే బ్యాంకుల్లో మీ డబ్బులు ఉంటున్నయ్. ధరణిని తీసివేస్తే ఈ డబ్బులు ఎలా వస్తయ్ ? మళ్లీ ఎమ్మార్వో ఆఫీసులు.. అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరిగలా..? రైతుబంధు ఎంత వస్తుంది రూ.60వేలు వస్తుందంటే.. రూ.20వేలు లావ్.. లేకపోతే సంతకం పెట్ట అంటడు. ఇంతకు ముందు కాంగ్రెస్ రాజ్యంలో చూడలేదు. కాంగ్రెస్ రాజ్యంలో ఆపద్భాందు పెట్టారు. రూ.50వేలు ఒక్కరికీ ఇవ్వలేదు. చెప్పులరిగేలా తిరిగితే ఆరు ఏడు నెలలు రూ.10వేలు చేతులపెట్టేది. మళ్లీ అదే రాజ్యం రావాల్నా? మళ్లీ తాకట్లు పెట్టి.. కేసులు, ఆఫీసుల చుట్టూ తింపి.. రైతుల దగ్గర లంచాలు గుంజి మళ్లీ దళారీ రాజ్యమే రావాల్నా’? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.