HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘నేను కొట్టినట్టు చేస్త… నువ్వు ఏడ్చినట్టు చెయ్యి’ అంటూ కాంగ్రెస్ సర్కారులోని పెద్దలు పరస్పరం ఆడుతున్న ‘హైడ్రా’మా ఇది! హైడ్రా తెరపైకి వచ్చింది మొదలు.. పెద్దోళ్లు సవాళ్లు విసురుతూనే ఉన్నారు. బడాబాబుల చెరువుల కబ్జా బాగోతాలు బయటికి వస్తూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్క వ్యవస్థ కూడా బుల్డోజర్లు తీసుకున్నది లేదు. వాటిని కూల్చింది లేదు. కానీ, మరోవైపు ఏకంగా 21 చోట్ల సుమారు 127 నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఇందులో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడి నిర్మాణాలు మినహా అందరూ సామాన్యులే. కొందరు నిరుపేదలు కూడా ఉన్నారు. హైడ్రా ఏర్పాటైన నెలన్నర వ్యవధిలోనే ఎందరో సామాన్యులు నిలువ నీడ లేకుండా వీధిన పడ్డారు. పైసాపైసా కూడబెట్టుకొని, జీవితాశయంగా నిర్మించుకున్న కలల సౌధాలను సర్కారు నిర్ధాక్షిణ్యంగా కండ్ల ముందే నేలమట్టం చేస్తుంటే గుండెలు అవిసేలా రోదించారు. కనీసం సామాను తీసుకునే సమయమైనా ఇవ్వండంటూ కాళ్లావేళ్లా పడ్డారు. ఏ ఒక్క అధికారి గుండె కరగలేదు. ఏ ఒక్క ప్రభుత్వ పెద్ద కనికరించలేదు. మరి.. ఎన్నాళ్లీ ‘పెద్దోళ్ల సవాల్.. పేదోళ్ల ఇండ్ల ఢమాల్’ నీతి అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు.
రేవంత్ చెప్పినా బుల్డోజర్లు పోవటం లేదేం?
జంట జలాశయాల పరిధిలో పెద్దోళ్ల ఫాంహౌస్‌లు అక్రమమంటూ సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే తన ప్రసంగాల్లో అధికారికంగానే ప్రకటిస్తున్నారు. ఒకటీ.. రెండు సార్లు కాదు! ఇప్పటివరకు దాదాపు ఏడెనిమిది వేదికలపై ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెద్దోళ్లు మురుగు వదిలితే ఆ నీటిని నగరవాసులు తాగాల్నా? అని ప్రశ్నించారు. నిజంగా ఇది అనాగరికమే! అయినా.. జంట జలాశయాల వైపు బుల్డోజర్లు మాత్రం పోవటం లేదు. ఆగస్టు 18న గండిపేట ఎఫ్టీఎల్లో ఉన్నదంటూ ఓ పారిశ్రామికవేత్త నిర్మాణాన్ని కూల్చిన హైడ్రా, ఆపై అసలు 111 జీవో పరిధి తమది కానే కాదు.. అని నాలుక మడతేసింది. ‘కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఫాంహౌస్‌ను కూలగొట్టాల్నా? లేదా?’ అని రెండు రోజుల కిందట ప్రజలు ఉన్న సభలోనే సీఎం ప్రశ్నించారంటే అది అక్రమమని ఆయన ధ్రువీకరించినట్టే కదా. పక్కా సమాచారం ఉంటే తప్ప సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ధ్రువీకరించరనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యమే. దీంతో కేవీపీ ఫాంహౌస్ ఎక్కడ ఉన్నదనేది కొలతలు తీయాల్సిన అవసరమూ లేదు. నిబంధనల కోసం వెతకాల్సిన పనిలేదనేది పలువురి అభిప్రాయం. కాకపోతే ఇవన్నీ కాంగ్రెస్ పెద్దల నోటి నుంచి వస్తున్నాయేగానీ, నొసలు మాత్రం అధికారులకు ఆదేశాలు ఇవ్వటం లేదు. అందుకే జంట జలాశయాల పరిధిలో ఉన్న బడాబాబుల ఫాంహౌస్‌ల జోలికి హైడ్రా వెళ్లడం లేదు. సంబంధిత జలమండలి, నీటిపారుదలశాఖ అధికారులు కూడా పోవటం లేదు. వీటి వెనుక అంతర్యమేమిటి? అంటూ ప్రజల్లో సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.
సామాన్యులకు అవకాశాలేవి?
పెద్దోళ్ల ఫాంహౌస్‌ల విషయంలో సీఎం మొదలు అధికారుల వరకు తర్జనభర్జనలు పడుతున్నారు. సవాళ్లు-ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. సమయం ఇవ్వాలని చెబుతున్నారు. కానీ గత రెండు నెలలుగా రాష్ట్రంలో.. మరీ ముఖ్యంగా హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో పేకమేడల్లా కూలిపోతున్న సామాన్యుల నిర్మాణాల విషయంలో మాత్రం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ అవకాశాలు ఇవ్వడం లేదు. ‘నోటీసులిస్తే కోర్టుకు పోతారు.. స్టే తెచ్చుకుంటారు.. అందుకే ఇవ్వటం లేదు’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెలవిచ్చారంటే.. సామాన్యుడు న్యాయస్థానాలను ఆశ్రయించే ప్రాథమిక హక్కును కూడా ఈ ప్రభుత్వం హరించివేసింది.
సామాన్యుడి ప్రశ్నలు.. జవాబివ్వు రేవంత్
‘రంగారెడ్డి జిల్లా కాగజ్‌ఘాట్ పరిధిలోని అలీ చెరువు విస్తీర్ణం 25 ఎకరాలు. చెరువు పరిధిలో ఎన్ఆర్ డెవలపర్స్‌కు చెందిన ముప్పాళ్ల వెంకటనర్సయ్య అక్రమ నిర్మాణాలు చేపట్టారు. తగిన చర్యలు తీసుకోండి’.
– నడి చెరువులో రిసార్టు ఏర్పాటు చేసి, విల్లాలు కట్టడంపై నీటిపారుదల శాఖ ఏఈ ఈ ఆర్ శారద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు (ఎఫ్ఐఆర్-110/ 2024)లోని సారాంశమిది. అంతేకాదు.. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపడుతున్నందున చర్యలు తీసుకోవాలని డీఈఈ సైతం హెచ్ఎండీఏకు లేఖ రాశారు. ఏ ఒక్క అధికారి కన్నెత్తి చూడరు. ఎందుకంటే బీహార్ అసెంబ్లీ బలపరీక్షకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంపు నిర్వహించింది ఇక్కడే. వారిని కలిసేందుకు రేవంత్ వస్తుండని ప్రభుత్వ నిధులతో చెరువులో రోడ్డును నిర్మించారు.
‘అజీజ్‌నగర్‌లోని నా ఫాంహౌస్ ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఒక్క అంగుళం ఉన్నట్టు అధికారుల సర్వేలో తేలినా సొంత ఖర్చులతో నేనే కూల్చివేయిస్తా. కాంగ్రెస్ నేతగా నాకు మినహాయింపులు వద్దు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా వ్యవహరిస్తుందో అదే చాలు. వీలు చూసుకొని అధికారులను ఫాంహౌస్‌కు పంపండి. చట్టప్రకారం మార్కు చేస్తే.. ఏదైనా కట్టడం దాని పరిధిలో ఉంటే.. 48 గంటల్లో నా సొంత ఖర్చులతో కూలుస్తా. మార్కింగ్ చేసే సమయం, తేదీ ముందే ప్రకటించండి’
-తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో చెప్పిన విషయాలివి. కేవీపీ రామచంద్రారావు ఫాంహౌస్ జలాశయానికి ఆనుకొనే ఉన్నదనేది అక్కడికి వెళ్లిన ఎవరికైనా కండ్ల ముందు కనిపించే దృశ్యం. అయినా కొలుచుకోండి! కూల్చుకుంట!! అంటారు. ఎందుకంటే హైడ్రా అటు పోయేది లేదు.. కూల్చేది లేదు.
‘బాజాప్తా అనుమతి తీసుకొని ఇల్లు కట్టుకున్నాను. కట్టుకునే సమయంలో ఇది ఎఫ్టీఎల్ ఉన్నది. బఫర్‌జోన్‌లో ఉన్నదే విషయం నాకు తెలియదు. డాక్యుమెంట్లు తీసుకున్న. న్యాయవాదికి ఇచ్చిన. అంతా సరిగా ఉన్నదంటేనే ఇల్లును కొనుగోలు చేశా. నోటీసులు ఇస్తే ఇవ్వండి. కూల్చివేతలు నా ఒక్కడి కోసం కాదు. అందరి కోసం చేస్తున్నారు. అధికారులు చేయాలి. సీఎం ఏం చేస్తాడు? అక్రమ నిర్మాణాలుంటే కూల్చివేయాల్సిందే కదా’
సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. దుర్గం చెరువు పరిధిలో వెలిసిన అమర్ హౌసింగ్ సొసైటీ సభ్యులకు నెల వ్యవధితో అధికారులు నోటీసులు ఇచ్చారు. నెలన్నర గడిచినా అటువైపు కన్నెత్తి చూడలేదు. ఈలోగా హైకోర్టు నుంచి స్టే వచ్చింది. ఇంకేముంది.. అంతా గప్‌చుప్!
‘సీఎం రేవంత్‌రెడ్డి గండిపేట, హిమాయత్‌సాగర్‌లో అడ్డంగా ఉన్న ఇండ్లు తీస్తున్నరు. అది మంచి కార్యక్రమం. నేను గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తిని. మంచి హోదాలో ఉన్నందున నేనే ముందుండి బాధ్యత తీసుకొని నా ఫాంహౌస్‌ను తీయాల్సి ఉంటుంది. కానీ అది ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో లేదని అధికారులే నివేదిక ఇచ్చారు. ఒకవేళ నివేదిక తప్పు.. నిర్మాణం ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉంటే నేనే దగ్గర ఉండి తీసేయిస్త’
– మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వ్యాఖ్యలు ఇవి. చుట్టూ నీళ్లతో మధ్యలో ఓ ఐలాండ్లా ఉన్న మహేందర్‌రెడ్డి ఫాంహౌజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అది చూసిన ఎవరైనా ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ అంటూ లెక్కలు చూడరు. జలాశయంలోనే ఉంది కదా! అనే నిర్ణయానికొచ్చారు.
‘అది నేను కొన్నది. ఆ కాంపౌండ్ వాల్ నేను కట్టుకున్నది కాదు. వివేక్ వెంకటస్వామి ఫాంహౌస్ చట్టప్రకారం లేదని అంటున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా. పరువు నష్టం దావా వేస్తా. ఎఫ్టీఎల్ నుంచి 30 మీటర్ల తర్వాత కట్టుకోవచ్చని చట్టం ఉన్నది. ఈ చట్టం ప్రకారమే నేను నిర్మాణం చేపట్టాను. నేను ఏ విషయంలోనైనా చట్టం ప్రకారమే చేస్తాను’
– మాజీ ఎంపీ, తాజా కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇలా సెలవిచ్చారు. కానీ జలమండలి అధికారుల నివేదికలో వివేక్ నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నాయని తేల్చారు. అందుకు నిదర్శనమే ఈ నివేదిక. అయినా.. బుల్డోజర్లకు అటువైపు వెళ్లే ధైర్యం లేదు.
‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మంచి ఉద్దేశంతో హైడ్రాను ఏర్పాటు చేశారు. ఒకటే చాలెంజ్ విసురుతున్నా. హైడ్రా అధికారి రంగనాథ్‌ను ఆదేశిస్తున్నా. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు వాళ్లకు సంబంధించిన యూట్యూబ్, వ్యవస్థలు అందరూ కొత్త టేపు కొనుక్కొని నా ఇల్లు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ఉన్నా, చివరకు ఒక ఇటుకపెల్ల ఉన్నా వెంటనే ఇల్లు మొత్తం పడగొట్టండి. ఇది పొంగులేటి చాలెంజ్.
– రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ ఇది. తొలుత గాంభీర్యాన్ని ప్రదర్శించినా, ఆ తర్వాత గూగుల్ తల్లి మంత్రి గారి సౌధం గుట్టు విప్పింది. అంతేకాదు.. పురపాలక శాఖ 500 మీటర్ల (అర కిలోమీటరు) నిబంధన కూడా తెరపైకి రావటంతో ఇప్పటివరకు మంత్రువర్యులు నోరు మెదిపింది లేదు. రంగనాథ్ కాదు కదా.. కనీసం జలమండలి అధికారులు పాత టేపులను తీసుకొని కూడా అక్కడికి వెళ్లలేదు.