భయపెట్టి బెదిరించే ప్రయత్నమా? లేక విలువైన మొత్తం స్థలాన్ని చేజిక్కించుకుని బేరానికి పెట్టే ఎత్తుగడనా? లేక పంతం నెగ్గించుకునేందుకు బ్లాక్‌మెయిలింగ్ పన్నాగమా? అసలు ఈ మూడింటిలో ఏది నిజమో తెలియదు కానీ, రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తాన్నే కంచ గచ్చిబౌలి నుంచి తరలించే దుస్సాహసానికి వ్యూహం పన్నినట్టు కనిపిస్తున్నది. ప్రభుత్వమే ఈ మేరకు నిన్న తన అనుకూల పత్రికలకు లీకులు ఇచ్చింది. శనివారం మీనాక్షి నటరాజన్‌తో జరిపిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ విద్యార్థులు స్వయంగా దీన్ని ధ్రువీకరించారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం ఫలితంగా.. ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన సెంట్రల్ వర్సిటీకి 2,800 ఎకరాల భూములను కేటాయిస్తున్నట్టు సాక్షాత్తు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పేర్కొనగా.. ఇప్పుడు అంత పెద్ద యూనివర్సిటీని నగరం ఆవల ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీలో కేవలం వంద ఎకరాల్లోకి కుదించాలని ప్రభుత్వం భావిస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయి. వందెకరాల వనసంహారం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. ఇప్పుడు ఎకో పార్కు పేరిట కసి తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
HCU | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ) : తొలి తెలంగాణ ఉద్యమ ఫలంగా అంది వచ్చిన ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ’ని నగరం దాటించేందుకు కుట్రలు మొదలయ్యాయా? అనాడు 370 మంది విద్యార్థుల రక్త తర్పణానికి జడిసిన ఇందిరమ్మ, తొలి శాంతి ప్రయత్నంలో భాగంగా కంచ గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన 2వేలకు పైగా ఎకరాల యూనివర్సిటీని రేవంత్‌రెడ్డి సింగిల్ పెన్ స్ట్రోక్‌తో ఫ్యూచర్ సిటీకి తరలిస్తున్నారా? 400 ఎకరాల కోసం నేడు హెచ్‌సీయూ విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఏమార్చి అసలుకే ఎసరు పెట్టే ఎత్తుగడ వేసిందా? ఈ ప్రశ్నలకు అన్ని వైపులనుంచీ ‘ఔను’ అన్న సమాధానమే వినిపిస్తున్నది. సెంట్రల్ వర్సిటీని కంచ గచ్చిబౌలి నుంచి తరలించటం వ్యయప్రయాసలతో కూడుకున్నదే అయినా.. అక్కడి భూములను అమ్మితే వచ్చే రాబడి ముందు అదేం పెద్ద సమస్యే కాదని పాలకులు అంచనాకు వచ్చినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
సాధ్యమైనంత వేగంగా ఫ్యూచర్ సిటీలో సెంట్రల్ యూనివర్సిటీకి 100 ఎకరాలు, క్యాంపస్ భవనాల నిర్మాణం కోసం రూ.1000 కోట్లు ఇచ్చేందుకు రేవంత్ సర్కారు ప్రణాళికలు రూపొందించినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈమేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి ఆహ్మద్ నదీం, సీఎం ముఖ్య కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం ఉదయం సచివాలయంలో సమావేశమై వర్సిటీ తరలింపు ప్రణాళికపై కసరత్తు చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. అందులో భాగంగానే దేశంలోనే అతిపెద్ద ఎకో పార్క్ అనే అంశాన్ని తెర మీదకు తెచ్చారని, సుప్రీంకోర్టు అడిగిన వివరాలకు తగిన జవాబు ఇస్తూనే..అదే అఫిడవిట్లో ప్రతిపాదిత ఎకో పార్కు ప్రణాళికను కూడా సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఈ ప్రతిపాదనలకు మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో శనివారం మరికొన్ని మెరుగులతో సీఎం రేవంత్‌కి తుది ప్రణాళిక సమర్పించినట్టు తెలిసింది.
ఇదే పాయింట్ ఎత్తుకుందాం!
యూనివర్సిటీలకు ఎంత భూమి సరిపోతుందనే అంశం మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దాదాపు 2000 ఎకరాల్లో ఉన్నదని, ఇందులో మహా అయితే ఓ 10-15 ఎకరాల్లో క్యాంపస్.. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలు ఉంటాయి. మిగతాది అంతా లంగ్ స్పేస్ అని, చిట్టడవిలా ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. అప్పట్లో కావాల్సినంత భూమి అందుబాటులో ఉంది కాబట్టి ,యూనివర్సిటీకి వేల ఎకరాలు కేటాయించారని, కానీ ఇప్పుడదంతా నిరుపయోగమేనని, 50 ఎకరాల్లో సెంట్రల్ వర్సిటీ సరిపోతుందనే వాదనలు వినిపించాలని భావిస్తున్నట్టు తెలిసింది. సెంట్రల్ వర్సిటీని అకడి నుంచి ఫ్యూచర్‌సిటీకి తరలించి, కంచ గచ్చిబౌలిలోని 2వేల ఎకరాల్లో ఎకో పార్ నిర్మించాలన్న ప్రతిపాదనను న్యాయం స్థానం ముందు పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల పరిహారంతో పాటు, భవనాల నిర్మాణాల కోసం రూ.1000 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తపరచాలని నిర్ణయించినట్టు తెలిసింది.
తనఖా పెట్టేందుకే ఏమార్చే ఎత్తులు!
నాడు హెచ్సీయూకు కేటాయించిన 2,324 ఎకరాల్లో కొంత అన్యాక్రాంతమైనట్టు అధికారులు గుర్తించినట్టు తెలిసింది. పోయిన భూమి పోగా మిగిలిన 2000 ఎకరాలను ఒక దగ్గరకు తెచ్చి ముందుగా ఎకో పార్కుగా మార్చితే ప్రజల దృష్టి మళ్లుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. అనంతరం నగరం చుట్టూ ఉన్న ఎకో పార్కులను ఒకే గొడుగు కిందికి తెచ్చి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, పార్కులను తనఖా పెట్టడం ద్వారా బ్యాంకు రుణాలు పొందవచ్చనే ఆలోచన చేసినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఏటికి ఎదురీది 400 ఎకరాలను అమ్మిన దానికంటే, ఎకో పార్కులను కొల్లేటరల్ గ్యారెంటీగా పెట్టడం ద్వారా మరింత సొమ్ము రాబట్టవచ్చని ప్రభుత్వం ఆలోచన చేసినట్టు ప్రచారం జరుగుతున్నది..
నాటి ఉద్యమంతో హెచ్‌సీయూ పునాది..
1969 జనవరి మొదటి వారంలో ప్రారంభమైన తెలంగాణ తొలి ఉద్యమం జనవరి 19 నాటికి తీవ్ర తరమైంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రత్యక్ష ఉద్యమంలోకి వచ్చారు. ఈ పోరాటంలో 370 మంది విద్యార్థులు పోలీస్ కాల్పులకు బలయ్యారు. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జోక్యం చేసుకొని 1969 ఏప్రిల్‌లో తెలంగాణ ప్రజల సమస్యల పరిషారానికి ఐదు ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షతో రగిలిపోతున్న విద్యార్థులను బుజ్జగించేందుకు 1973 సిక్స్ పాయింట్ ఫార్ములాలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీని తెరమీదికి తెచ్చారు. 1974లో యూనివర్సిటీని స్థాపించారు. తొలినాళ్లలో అబిడ్స్‌లోని సరోజినీ నాయుడు నివాసం, గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించేవారు. 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళ్రావు ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 2,324 ఎకరాల భూమిని యూనివర్సిటీకి కేటాయించింది.
మళ్లీ రణం..
హెచ్‌సీయూ క్యాంపస్నే కంచ గచ్చిబౌలినుంచి ప్రభుత్వం తరలించేందుకు ప్రయత్నిస్తున్నదన్న వార్తల నేపథ్యంలో ఆందోళనకు దిగిన విద్యార్థులు
మరో హరిణం
జింకలే లేవన్న కంచ గచ్చిబౌలిలో మరో జింక మృత్యువాతకు గురైంది. చెట్లు నరికివేసిన ప్రాంతంలో జింక పిల్ల కుక్కల దాడిలో చనిపోయినట్టు గుర్తించిన విద్యార్థులు అధికారులకు సమాచారమందించారు.
బుల్డోజర్లు అబద్ధం..
జింకల పరుగులు అబద్ధం.. నెమళ్ల అరుపులు అబద్ధం.. హెచ్‌సీయూలో అంతా అబద్ధం!
– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ప్రభుత్వ వాదన
ఏది అబద్ధం? యుద్ధట్యాంకుల్లా హెచ్సీయూపైకి వెళ్లిన బుల్డోజర్లు అబద్ధమా? నిశీధిలో పచ్చని చెట్లను కూకటివేళ్లతో పెకిలించడం అబద్ధమా? ప్రాణభయంతో జింకల బతుకు పరుగు అబద్ధమా? నెమళ్ల ఆర్తనాదాలు అబద్ధమా? విద్యార్థుల ఆందోళనలు అబద్ధమా? విద్యార్థులపై పోలీసుల లాఠీ దెబ్బలు అబద్ధమా? విద్యార్థులపై పెట్టిన కేసులు అబద్ధమా? చేసిన అరెస్టులు అబద్ధమా?
–ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల ప్రశ్న!