హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం నాలుగు రకాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 20లోగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాల్సి ఉండడంతో జిల్లా అధికారులు సీనియార్టీ జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయానికి పంపించారు.
బదిలీల కోసం రాష్ట్ర స్థాయి, మల్టీ జోనల్, జోనల్, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్‌శాఖలో లోక్‌సభ ఎన్నికలకు ముందు భారీగా బదిలీలు జరిగాయి. సాధారణ బదిలీల్లో అవకాశం కల్పించాలని, ఎంపీడీవోలు, అధికారులు కోరుతున్నారు.
ఎన్నికల నిబంధనతో ఎక్కడికో బదిలీ అయ్యామని, మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. 317 జీవో బాధిత ఉద్యోగులు సాధారణ బదిలీల్లో తమకు అవకాశం రావడంలేదని, తమకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన లేదని ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.