హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేవాదాయ, ధర్మాదాయ శాఖలోకి ఇతర శాఖల ఉద్యోగులను డిప్యూటేషన్‌పై ఇవ్వాలంటూ ఆ శాఖ కమిషనర్ వెంకట్రావు ఈ నెల 9న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్‌తోపాటు పలు శాఖలకు లేఖలు పంపారు. తమ శాఖలో రెగ్యులర్ రిక్రూట్మెంట్లు పూర్తయ్యేవరకు అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లుగా పనిచేయడానికి వివిధ విభాగాల్లో అర్హతలు కలిగిన ఉద్యోగులను డిప్యూటేషన్‌పై కేటాయించాలంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు మరో ఐదు శాఖలకు లేఖ రాసినట్టు తెలిసింది. రాష్ట్రంలో 646 అసెసబుల్ దేవాలయాలు ఉన్నాయని, అవి తమ శాఖ నియంత్రణలో నడుస్తున్నాయని కమిషనర్ అందులో పేర్కొన్నారు.
ప్రస్తుతం దేవాలయాల నిర్వహణకు సంబంధించి తమ శాఖలో డిప్యూటీ కమిషనర్ పోస్టు ఒకటి (స్టేట్ క్యాడర్), అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు ఆరు (మల్టీ జోనల్), ఎగ్జిక్యూటివ్ గ్రేడ్-1 ఆఫీసర్ పోస్టులు ఆరు (జోనల్), గ్రేడ్-3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు 61 చొప్పున ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో డిప్యూటీ కమిషనర్ పోస్టుకు డిప్యూటీ కలెక్టర్ లేదా అదే స్థాయిలో పేస్కేల్ ఉన్న అధికారి కావాలని, మిగతా పోస్టులకు అర్హతలను బట్టి వారి స్వీయ సమ్మతితో నియమించడానికి ప్రభుత్వం అనుమతించిందని కమిషనర్ ఆ లేఖలో పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో 233 రెగ్యులర్ ఈవో పోస్టులకు నియామకాలు లేనందున, వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఉద్యోగులను డిప్యూటేషన్‌పై తీసుకుని అవసరమైనచోట నియామకాలు చేపడతామని కమిషనర్ వివరించారు.
మంత్రిని కలిసిన ‘దేవాదాయ’ ఉద్యోగులు
దేవదాయ శాఖలో డిప్యూటేషన్‌పై వేరే శాఖల నుంచి ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వం అంగీకరించడంపై దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ శాఖలోని వారికి ప్రమోషన్లు ఇచ్చి, కొత్త నియామకాలు చేపట్టాల్సింది పోయి వేరే శాఖల ఉద్యోగులను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్‌ను పలువురు అధికారులు, సంఘాల నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆర్జేసీ రామకృష్ణారావు, డిప్యూటీ కమిషనర్లు సంధ్యారాణి, శ్రీకాంతరావు, తెలంగాణ అర్చక, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రత్నాకర్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల సంఘం సెక్రటరీ రాజేశ్, పలువురు అసిస్టెంట్ కమిషనర్లు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఉన్నారు.
వేరే శాఖలకు చెందినవారిని డిప్యూటేషన్‌పై తీసుకోవద్దని కోరారు. రాష్ట్రంలోని సంస్థల్లో దాదాపు 250 మంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుతోపాటు క్లరికల్ సిబ్బంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఆలయ పరిపాలనలో తమకు అనుభవం ఉండటమే కాకుండా, ప్రమోషన్లకు సంబంధించిన పరీక్షలన్నీ పూర్తిచేసి అర్హతలు కలిగి ఉన్నామని వివరించారు. వివిధ క్యాడర్లలో తగినంత సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ, ప్రమోషన్లు ఇవ్వకపోవడంతో తాము మానసిక వేదనకు గురవుతున్నామని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రమోషన్లు రాకుండానే చాలామంది రిటైర్ అవుతున్నారని, ఆ మేరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనేకమంది కన్సాలిడేటెడ్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో దేవాదాయ శాఖలో పనిచేస్తున్నారని, అవసరాన్ని బట్టి వారిని పలు పోస్టుల్లో నియమించుకోవాలని, అదేవిధంగా ప్రమోషన్లు ఇచ్చి తమ శాఖ ఉద్యోగులనే ఈవోలుగా నియమించాలని దేవాదాయ శాఖ ఉద్యోగులు కోరారు.