హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ) : అచ్చంపేటలో సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన బహిరంగ సభలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శరత్‌కుమార్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళ్లు మొక్కి బంజరా జాతి ఆత్మగౌరవాన్ని దిగజార్చారని గిరిజన చైతన్య వేదిక అధ్యక్షుడు, ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజునాయక్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒక ప్రభుత్వశాఖకు కమిషనర్‌గా అత్యున్నత హోదాలో ఉన్న అధికారి రాజకీయ నాయకుడి కాళ్లు మొక్కి గిరిజనజాతి గౌరవాన్ని, అధికార వ్యవస్థ ఆత్మాభిమాన్ని కించపరిచారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ చర్య బంజారా జాతికి, భారత రాజ్యాంగానికి తీరని అవమానంగా ఆయన పేర్కొన్నారు. బంజారా బిడ్డలు ఐఏఎస్, ఐపీఎస్‌లుగా ఎదగాలని తమ జాతి ఆకాంక్షిస్తుంటే.. శరత్‌నాయక్ లాంటి అధికారులు దిగజారుడు తనంతో జాతి తలదించుకునేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. శరత్‌నాయక్ వెంటనే తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని, బంజారాజాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అతన్ని లంబాడా జాతి నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు.