హైదరాబాద్, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్ శనివారం నిర్వహించిన బహిరంగ విచారణకు రామగుండం విశ్రాంత ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరయ్యారు. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం, డిజైన్లు, కుంగుబాటుకు గల కారణాలపై సమాధానాలు ఇచ్చారు.
2016 జనవరి 17న అప్పటి సీఎం నిర్వహించిన సమావేశంలోనే మేడిగడ్డ డీపీఆర్‌ను వ్యాపోస్ సమర్పించిందని, ఫిబ్రవరి 2017లో డీపీఆర్‌ను సీడబ్ల్యూసీకు పంపించగా, 2018 జూన్‌లో ఆమోదం లభించిందని వెల్లడించారు. కరీంనగర్ సీఈ ప్రతిపాదనలకు అనుగుణంగా వ్యాపోస్ డీపీఆర్‌లో లొకేషన్లను మార్చిందని తెలిపారు.
వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తాక నీళ్లు స్టిల్లింగ్ బేసిన్లో పడకుండా వేగంతో దూసుకురావడంతో సీసీ బ్లాకులు, లాంచింగ్ ఆప్రాన్లు కొట్టుకుపోయి బ్లాక్ 7పై ప్రభావం పడి ఉంటుందని, సీకెంట్ పైల్‌లో పైపింగ్ కూడా బరాజ్ పిల్లర్ కుంగుబాటుకు కారణమై ఉంటుందని వెల్లడించారు.
ఎన్ఐటీ వరంగల్, చెన్నై ఐఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా సీకెంట్ పైల్స్ లేదా సూటబుల్ పైల్స్ వినియోగించుకోవచ్చని సూచించారని, వాటి ఆధారంగా సీఈసీడీవో సీకెంట్ పైల్స్ పాటు డయాఫ్రం వాల్లను సూచించిందని తెలిపారు. రికార్డులను పరిశీలించి సమర్పించేందుకు గడువు కావాలని వెంకటేశ్వర్లు కోరగా, అందుకు కమిషన్ అంగీకరించింది. విచారణకు మళ్లీ రావాలని వెంకటేశ్వర్లను జస్టిస్ ఘోష్ ఈ సందర్భంగా ఆదేశించారు.