హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీల (Private Colleges) యాజమాన్యాలు మళ్లీ బంద్ బాట పట్టనున్నాయి. కాలేజీలను నిరవధికంగా మూసివేయనున్నాయి. ఈ నెల 6 నుంచి కాలేజీల బంద్‌ను నిర్వహించనున్నట్టు తెలుస్తున్న ది. దసరా సెలవుల తర్వాత కాలేజీలు పునఃప్రారంభంకావాల్సి ఉండగా, కాలేజీలను తెరువవద్దని యాజమాన్యాలు నిర్ణయించినట్టు తెలిసింది. రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్‌కు పిలుపునిచ్చాయి. ఒకరోజు బంద్ విజయవంతమైంది. దీంతో ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపింది. దసరాకు రూ.600 కోట్లు, దీపావళి తర్వాత మరో రూ.600 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో యాజమాన్యాలు బంద్‌ను విరమించాయి.
రూపాయి విడుదల కాలేదు
బంద్ విరమించి రెండు వారాలు పూర్తయినా, ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్‌బాబు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు భేటీ అయ్యారు. బకాయిలను విడుదల చేయాలని కోరారు. సర్కారు ఇప్పుడు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హైయ్యర్ ఎడ్యుకేషన్స్ (ఫతి) ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో అత్యవసరంగా సమావేశం కావాలని నిర్ణయించారు. సమావేశంలో కాలేజీల బంద్ సహా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో దసరా సెలవుల తర్వాత కాలేజీలు తిరిగి ఓపెన్‌కావడం కష్టంగానే కనిపిస్తున్నది.