హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయా..? లేదా..? అన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. కాలేజీల యాజమాన్యాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి చర్చలు జరపడం, ఇవి ఫలప్రదం కావడంతో పరీక్షలకు మార్గం సుగమమయ్యింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ కాలేజీల యాజమాన్యాలు 40రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నాయి.
ఈ నెల 14 నుంచి శాతవాహన, మహత్మాగాంధీ, కాకతీయ వర్సిటీల్లో డిగ్రీ పరీక్షలు జరగాల్సి ఉంది. 15 నుంచి పాలమూరు, 16 నుంచి తెలంగాణ వర్సిటీలో పరీక్షలు జరగాల్సి ఉంది. ఒకవైపు కాలేజీ యాజమాన్యాలు సమ్మెకు దిగడం, బుధవారం నుంచి పలు వర్సిటీల్లో పరీక్షలు జరగాల్సి ఉండటంతో ఈ పరీక్షలు జరిగేనా..? అన్న అనుమానాలు తలెత్తాయి.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సోమవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీఎంఏ) నేతలతో చర్చలు జరిపారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి డిగ్రీ కాలేజీ యాజమాన్యాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు అసోసియేషన్ నేతలకు తెలిపారు. రూ. 250-300 కోట్ల బకాయిల విడుదలకు సీఎం హామీ ఇచ్చినట్టు బాలకిష్టారెడ్డి వివరించారు. సమ్మెను విరమించాలని కోరారు. దీంతో కాలేజీల యాజమాన్యాలు సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించాయి.