Fee Reimbursement | హైదరాబాద్, జూలై13 (నమస్తే తెలంగాణ) : ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు పాత బకాయిలు పూర్తిగా చెల్లిస్తం’.. ఇది ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వాగ్దానం. కానీ, ఇప్పుడు ఆర్థిక భారం సాకుతో బకాయిల చెల్లింపునకు ఎగనామం పెట్టాలని నిర్ణయించింది. పూర్తి బకాయిలు ఇవ్వకుండా వన్ టైం సెటిల్మెంట్ కింద కాలేజీ యాజమాన్యాలకు ఎంతోకొంత ముట్టజెప్పేందుకు సిద్ధమైంది.
ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డియే జేఎన్టీయూ వేదికగా శనివారం ప్రకటించారు. వన్‌టైం సెటిల్మెంట్ బాధ్యతను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు అప్పగిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం యాజమాన్యాల సంగతేమోగాని పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు శాపంగా మారనున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. వీరు ఉన్నతవిద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న బీసీ, విద్యార్థి సంఘాలు తాజాగా సీఎం చేసిన ప్రకటనపై మండిపడుతున్నాయి.
దాదాపు 7వేల కోట్ల బకాయిలు
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్లను మూడు నెలలకోసారి వాయిదాల పద్ధతిలో చెల్లించేలా ప్రభుత్వం గతంలో మార్గదర్శకాలు తీసుకొచ్చింది. దాని ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభంలో 25శాతం, మధ్యలో 50శాతం, చివర్లో మరో25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని పాటించడం లేదు.
బకాయిల చెల్లింపుల కోసం కళాశాలలకు ఏడాది క్రితం నిర్దేశిత మొత్తాలతో ప్రభుత్వం టోకెన్లు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులే దాదాపు రూ.6200కోట్లకు పైగా బకాయి ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక ఉపకారవేతనాలు కలుపుకొంటే సుమారు రూ.8వేల కోట్లకు పైనే పేరుకుపోయాయని అధికారవర్గాలు, విద్యార్థిసంఘాలు వెల్లడిస్తున్నాయి.
సెటిల్మెంట్తో బడుగు విద్యార్థులకే నష్టం
వన్‌టైం సెటిల్మెంట్ అంటే కాలేజీల వారీగా బకాయి ఉన్న నిధుల్లో ఎంతోకొంత మాత్రమే ఏకమొత్తంగా చెల్లించే అవకాశమున్నట్టు తెలుస్తున్నది. ఇది బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకే గుదిబండగా మారే ప్రమాదముంది. ఫీజులు వదులుకునేందుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించవు. ప్రభుత్వం నయానోభయానో ఒప్పించినా పేద విద్యార్థుల ముక్కుపిండి వసూలు చేస్తాయనేది బహిరంగ రహస్యం.
ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఏటా 10లక్షల మందికిపైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. రీయింబర్స్‌మెంట్‌పై నమ్మకంతో ఉన్నత విద్యాభ్యాసానికి ముందుకొచ్చి ప్రైవేట్ కాలేజీల్లో కోర్సులు పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే రీయింబర్స్మెంట్ నిధులు రాక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఫీజులు చెల్లించనిదే పరీక్షలు రాయనివ్వని దుస్థితి నెలకొన్నది. కొందరు అప్పుచేసి, కొందరు సొంతంగా ఫీజులు చెల్లిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది.
ఇక ఎలాంటి అవకాశం లేని నిరుపేద విద్యార్థులు ఉన్నత విద్యకు మధ్యలోనే స్వస్తిపలుకుతున్నారని విద్యార్థిసంఘాలు వివరిస్తున్నాయి. కొందరు పూర్తిచేసినా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగావకాశాలు పొందలేకపోతున్నారని వాపోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో భవిష్యత్‌లో పేద విద్యార్థులెవరూ ఉన్నత విద్యాకోర్సుల్లో చేరేందుకు ముందుకురారని, కాలేజీలు కూడా అడ్మిషన్స్ ఇవ్వవని విద్యార్థి సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు వాదిస్తున్నారు. వన్‌టైం సెటిల్మెంట్ కింద కాకుండా, బకాయిలను పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.