హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిన యాజమాన్యాలు మళ్లీ వెనక్కి తగ్గాయి. ప్రభుత్వ హామీతో బంద్‌ను వాయిదా వేసుకున్నాయి. హామీ మేరకు దీపావళిలోపు రూ. 300 కోట్లు విడుదల చేయాలని, లేకపోతే ఈ నెల 23 నుంచి కాలేజీల బంద్ నిర్వహిస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్(ఫతి) ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం సెప్టెంబర్ 15 నుంచి కాలేజీల బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఒక రోజు విజయవంతంగా బంద్ జరగగా, ప్రభుత్వం యాజమాన్యాలతో మూడుసార్లు చర్చలు జరిపింది. దసరాలోపు రూ. 600 కోట్లు, ఆ తర్వాత రూ. 600 కోట్లు విడుదల చేస్తామన్నది. దీంతో యాజమాన్యాలు బంద్ విరమించాయి. అయితే దసరా సమీపించినా ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఎట్టకేలకు కొంత మొత్తం విడుదల చేసింది. దీంతో మళ్లీ కాలేజీ యాజమాన్యాలు ఈ నెల 13 నుంచి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఫతి ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీపావళి నాటికి రూ. 300 కోట్లు విడుదల చేస్తామని, అప్పటి దాకా సమ్మెను వాయిదావేయాలని వేం నరేందర్‌రెడ్డి కోరగా, ఇందుకు ఫతి ప్రతినిధులు అంగీకరించారు. ఈ నెల 22 లోపు రూ. 300 కోట్లు విడుదల చేయాలని, లేదంటే ఈ నెల 23 నుంచి కాలేజీల బంద్‌కు పిలుపునిస్తామని ఫతి ప్రతినిధులు ప్రకటించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం కాలేజీల పోరాటం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందాన్ని తలపిస్తున్నది. యాజమాన్యాలు ప్రభుత్వాన్ని అతిగా విశ్వసిస్తున్నాయి. పలుమార్లు మోసం చేసినా.. నయవంచన చేసినా ఇంకా నమ్ముతున్నాయని సాక్షాత్తు కాలేజీల యాజమాన్యాలే అంటున్నాయి. కాలేజీలకు మొత్తంగా రూ. 10వేల కోట్లు సర్కారు బాకీపడింది. అయితే రూ. 3,543 కోట్లకు టోకెన్లు జారీచేయగా, రూ. 1,207 కోట్లకే టోకెన్లు జారీ అయ్యాయని బుకాయించింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోని బకాయిలను చెల్లించబోమని, తమ ప్రభుత్వ బకాయిలనే అడగాలన్నది. ఇక చివరికి దసరాలోపు రూ. 600 కోట్లు విడుదల చేస్తామని రూపాయి కూడా విడుదల చేయలేదు. అక్టోబర్ 1న రూ. 200 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మొత్తం రూ. 1,200 కోట్లు ఇస్తామని చెప్పి.. కేవలం రెండు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రూ. 300 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో కాలేజీలు బంద్‌పై వెనక్కి తగ్గాయి. సర్కారు మోసం చేయడం.. కాలేజీలు బంద్ ప్రకటించడం.. ప్రభుత్వ పెద్దలు చర్చలు జరపడం.. బంద్‌ను వాయిదా వేయడం.. మళ్లీ కాలేజీలు బంద్‌కు దిగడం చూస్తుంటే ఇదంతా పిల్లలాటను తలపిస్తున్నదని కాలేజీల యాజమాన్యాలే అంటున్నాయి. ఇలా చేయడం సరికాదని, బకాయిలు విడుదలయ్యేంత వరకు ఉద్యమించాలని కొందరు కాలేజీల యాజమాన్యాలు సూచించడం గమనార్హం.