ఖిలావరంగల్ : గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధన లకు అనుగుణంగా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్వో విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీవో కల్పనతో కలిసి కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో అధికారులు కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లో 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 27, 30, వచ్చే నెల 3 తేదీల్లో నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు.
నామినేషన్ నుంచి చివరి ఫలితాల ప్రకటన వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్‌లోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఏ సందేహం ఉన్నా వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించాలన్నారు. ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఇవ్వకూడదని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు నగదు, మద్యం ఇతర వస్తువుల పంపిణీ వంటి చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమన్నారు.
చెక్‌పోస్టుల్లో వాహన తనిఖీలు నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.
జిల్లాలో మాన్పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల సమన్వయం, ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాలు, మెటీరియల్ మేనేజ్మెంట్, ఖర్చుల పర్యవేక్షణ, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ వంటి విభాగాల బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించడంలో ప్రతి నోడల్ అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున అందరూ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.