సుల్తాన్‌బజార్, ఆగస్టు 21: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందనే సాకుతో విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అవుతుందని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పేర్కొన్నది. ఈమేరకు గురువారం కమిషన్‌లో దాఖలైన 4775/2025 కేసును కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో తగిన ఉత్తర్వులను జారీ చేస్తూ కేసును ముగించారు. హెచ్ఆర్సీ 3772/2025 వంగల శృతి కేసులో జారీ చేసిన మునుపటి ఉత్తర్వులను, యూజీసీ మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ.. ఇలాంటి పద్ధతులు హక్కుల ఉల్లంఘనకు దారితీస్తాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్యాహక్కును అడ్డుకోవడమేనని కమిషన్ స్పష్టంచేసింది.
సుల్తాన్ ఉల్ ఉలూం కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి చెందిన 17మంది బీఫార్మసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉందని ఒరిజినల్ టీసీ, స్టడీ సర్టిఫికెట్లను కళాశాల యాజమాన్యం చట్టవిరుద్ధంగా నిలిపివేయడంతో విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నది. సర్టిఫికెట్లను వెంటనే విద్యార్థులకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.