Sircilla | రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 19(నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ ఫొటో కనిపిస్తే చాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం కుతకుతలాడుతన్నది. ఎక్కడ ఆయన బొమ్మ కనిపించినా తీసేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నది. కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సిరిసిల్లలో రాజకీయ కక్షసాధింపు కొనసాగుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చనడుస్తున్నది. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల మద్దతుతో బీఆర్ఎస్ నుంచి ఏకంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వివిధ కారణాలతో బీఆర్ఎస్ నాయకుల అరెస్టుల పర్వం, జైలుకు పంపడం లాంటి ఘటనలు మరువకముందే తాజాగా ఓ చిరువ్యాపారి కేటీఆర్ ఫొటోతో ఏర్పాటు చేసుకున్న టీస్టాల్నే మూసివేసే స్థితికి అధికార యంత్రాంగం దిగజారింది.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ కొన్నేళ్లుగా టీస్టాల్ నడుపుతున్నాడు. కేటీఆర్‌పై అభిమానంతో తన స్టాల్‌కు ‘కేటీఆర్ టీ స్టాల్’గా పేరు పెట్టుకున్నాడు. హోటల్‌పై కేటీఆర్ చిత్రపటాలను ఏర్పాటు చేసుకున్నాడు. బుధవారం ఉదయాన్నే హోటల్ తీసిన శ్రీనివాస్ వద్దకు మున్సిపల్ అధికారులు వచ్చి ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నడిపిస్తారని, దాన్ని మూసేస్తామని బెదిరించారు. హోటల్ మూయవద్దని, లైసెన్సు ఫీజు ఎంతో చెప్తే చెల్లిస్తానని శ్రీనివాస్ బతిలాడినా అధికారులు పట్టించుకోలేదు. వెంటనే క్లోజ్ చేయాలని చెప్పి వెళ్లిపోయారు.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి టీ స్టాల్ యజమాని బత్తుల శ్రీనివాస్‌కు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కలెక్టర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ట్రేడ్ లైసెన్స్ తీసుకోలేదన్న కారణంగా మున్సిపల్ అధికారులు మూసి వేయించిన టీస్టాల్‌ను బీఆర్ఎస్ నేతలు దగ్గరుండి తెరిపించారు. కలెక్టర్ ఆదేశాల మేరకే తాము టీస్టాల్‌ను మూసి వేయించామని అధికారులు ఇచ్చిన సమాధానంపై నేతలు మండిపడ్డారు.
సిరిసిల్లలో కలెక్టర్ ఉదయం పర్యటించిన సమయంలో బతుకమ్మ ఘాట్ వద్ద ఉన్న దుకాణాలకు లైసెన్సులు ఉన్నాయా అని అడిగారు. లేవని చెప్పడంతో లైసెన్సు తీసుకునే వరకు దుకాణాలు బంద్ చేయాలని మౌఖిక ఆదేశాలివ్వడంతోనే హోటల్‌ను మూసివేయించినం.
– సత్యనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్
‘సిరిసిల్లలో టీ కొట్టు నడుపుకొంటున్న పేద వ్యక్తిని వేధించడం తగదు. అతడు కేటీఆర్ ఫొటో పెట్టుకున్నాడనే అక్కసుతో జిల్లా ఉన్నతాధికారులు కక్షసాధింపులకు దిగడం సరికాదు.’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఎక్స్‌వేదికగా హితవుపలికారు. ప్రతిదీ గుర్తు పెట్టుకుంటామని, ఏదీ మర్చిపోబోమని, కచ్చితంగా బదులిస్తామని హెచ్చరించారు. టీ కొట్టు నడుపుకొంటున్న పేద వ్యక్తి ఆవేదన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
నాలుగేండ్ల కిందనే కేటీఆర్ టీ స్టాల్ పెట్టుకున్న. మబ్బుల మూడు గంటలకు వచ్చి నా భార్య నేను హోటల్ నడుపుకుంటం. పొద్దుగాల పదైతే ఇక్కడికి ఎవరూ రారు. ఇన్నేండ్లలో నా హోటల్‌ను బంద్ చేయాలని ఏ సారూ అనలేదు. వాగును చూసేందుకు కొత్తగా వచ్చిన సారు తిరిగి వెళ్తున్న సమయంలో కేటీఆర్ బొమ్మను చూసి 20 నిమిషాల్లోనే మున్సిపల్ అధికారులను హోటల్ వద్దకు పంపిండు. కేటీఆర్ ఫ్లెక్సీ తీసెయ్యి అంటే తీసేసిన. కేటీఆర్ పేరు పెట్టుకుంటే గింత అన్యాయమా? కేటీఆర్ అన్న నాకు కూడా అన్నే. ఆయనంటే నాకు అభిమానం. అందుకే ఫొటో పెట్టుకున్న. లైసెన్సు ఫీజు ఎంతనో చెప్పుండ్రి కడుతా.. నేను ఎవరికీ అన్యాయం చెయ్యలే. నాకు గుండె జబ్బు ఉన్నది. నాకేమన్న అయితే కలెక్టర్, కమిషనరే బాధ్యులు. నా పిల్లల గోస వారికి తాకుతది.
– బత్తుల శ్రీనివాస్, హోటల్ యజమాని