హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): వానాకాలం ధాన్యం కొనుగోళ్లు సజావుగా పూర్తయినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,750 కోట్ల విలువైన 64.30 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు తెలిపారు. మిగిలిన రైతుల కోసం 24వ తేదీ వరకు చివరి అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా నుంచి, అత్యల్పంగా అదిలాబాద్ జిల్లా నుంచి ధాన్యం సేకరించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో రైతులకు చిన్న ఇబ్బంది కూడా తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని వివరించారు.
94 రోజులు నిరంతరాయంగా కొనుగోళ్లు జరిగాయని, మారుమూల ప్రాంతాల రైతులూ రవాణాకు ఇబ్బందులు పడొద్దని, అందుబాటులోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలో పంజాబ్ తర్వాత అత్యధికంగా వరి ధాన్యం సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ధాన్యం సీఎంఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సుదీర్ఘకాలం పాటు జరిగిన ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన రైతులకు, హమాలీలు, ప్యాక్స్, ఐకేపీ యంత్రాంగం, పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.