హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): కేవలం మూడు రోజుల్లోనే రాష్ట్ర పురపాలక పరిపాలనా శాఖకు రూ.20 కోట్ల ఆస్తి పన్ను వచ్చి చేరింది. గత నెలంతా కలిపి రూ.60 కోట్ల వరకు పన్నుల రూపంలో ఆదాయం సమకూరింది. మున్సిపల్ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్ర ఖజానాకు ఇలా పన్నుల పంట పండింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు జనవరి 28 నుంచి 30 వరకు నామినేషన్లు వేసిన సమయంలో తమ పాత బకాయిలను చెల్లించారు. దీంతో మున్సిపల్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్లు వేయడానికి ముందు పాత బకాయిలను క్లియర్ చేసేశారు.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి కేవలం జనవరి నెలలోనే సుమారు రూ.60 కోట్ల పన్ను వసూలైనట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు వేయాలంటే ఆస్తి పన్ను, నీటి పన్ను వంటి అన్నిరకాల బకాయిలు చెల్లించి నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. ఈ మేరకు ఎన్నికల నిబంధన ఉన్నది. దాంతో కొన్నేండ్లపాటు చెల్లించకుండా ఉన్న బకాయిలను రాజకీయ నాయకులు ఈ దఫా చెల్లించారు.
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో కేవలం రెండు వారాల్లోనే రూ.15 కోట్ల మేరకు వివిధ రకాల పన్నులు వసూలయ్యాయి. ఈ కార్పొరేషన్ మేయర్ పదవి ఆశిస్తున్న ఒక అభ్యర్థి రూ.7.5 కోట్ల బకాయిలు చెల్లించడం చర్చనీయాంశమైంది. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్‌లోనే అత్యధికంగా పన్నులు వసూలయ్యాయి. నిజామాబాద్‌తోపాటు ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్ల నుంచి కూడా అధికాదాయం సమకూరింది.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపాలిటీ, నీరు, విద్యుత్తు వంటి ప్రభుత్వ విభాగాలకు ఎలాంటి బకాయిలు ఉండకూడదనే నిబంధన ఉండటంతో నేతలు తప్పనిసరి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పన్నులు చెల్లించారు. అభ్యర్థులకు సౌకర్యంగా ఉండేందుకు, పన్ను చెల్లించిన 24 గంటల్లోనే వెబ్సైట్ ద్వారా నో డ్యూస్ సర్టిఫికేట్ జారీచేసేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.