హైదరాబాద్, జనవరి 3 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో ఈశాన్యగాలుల ప్రభావంతో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతున్నది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు చలితో వణికిపోతున్నారు. ఉదయం, రాత్రి వేళల్లో మరింతగా చలిప్రభావం చూపుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సగటున కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తకువగా నమోదు అవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎకువగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల నుంచి 7.2 డిగ్రీలకు పడిపోయింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు రెండు రోజులపాటు ఎల్లో అలర్ట్ జారీచేశారు. హైదరాబాద్ నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు తకువగా నమోదవుతున్నట్టు తెలిపింది. వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. రాష్ట్రంలో అత్యల్పంగా కుమ్రంభీం జిల్లా సిర్పూర్ (యూ)లో, గిన్నెదారిలో 6.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.