Cold Wave | హైదరాబాద్ : తెలంగాణలో చలి పంజా విసురుతోంది. నవంబర్ రెండో వారంలోనే చలి తీవ్రత ఇలా ఉంటే ముందుముందు ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత అధికమైంది. వరుసగా నాలుగు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రంలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యూ)లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు 10.2 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ గ్రామాల ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం సమయంలో పొగమంచు, చలిగాలులు వీస్తుండగా, రాత్రి సమయంలో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది.
నవంబర్ నెలలో సగటున 13 నుంచి 17 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉందని.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రానున్న 3 రోజులుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తెలంగాణలోని ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నల్లగొండ, భద్రాచలం, రామగుండం, నిజామాబాద్, హయత్నగర్, పటాన్చెరు, హైదరాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో చలి ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.