Cold Wave | హైదరాబాద్ : తెలంగాణను చలి వణికిస్తోంది. ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు 7.8 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. అదే విధంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్‌లో 8.3, వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటలో 8.7, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 8.8 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 7.8 నుంచి 13.9 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నవంబర్ నెలలో 2016లో మోమిన్‌పేటలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వగా.. శుక్రవారం కోహిర్లో నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 – 4 డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందన్నారు. ఉపరితల గాలులు ఈశాన్య దిశ నుంచి గంటకు 4-6 కి.మి వేగంతో వీచే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.