చలి వణికిస్తున్నది.. రాష్ట్ర వ్యాప్తంగా ఇగం రోజు రోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవగా.. మరో ఐదు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల్లోపు రికార్డయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్లో తాజాగా 5.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఇదే అత్యల్పం. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగిలిన ఐదు జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రత 12 డిగ్రీల్లోపు నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో శుక్రవారం కనిష్ఠ ఉష్ణోగ్రత 5.8గా నమోదైంది.
రాష్ట్రంలో ఇదే అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రత. ముఖ్యంగా సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల్లో చలి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్నది. రాబోయే 3 రోజులు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పొడిగాలి, బలంగా వీస్తున్న ఈశాన్య గాలుల కారణంగా చలి తీవ్రత పెరుగుతున్నదని అధికారులు తెలిపారు.