హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): పదిరోజులపాటు గజగజలాడించిన చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. ఈ మేరకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా 8.7, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 9.1, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 9.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని శుక్రవారం వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
వనపర్తి జిల్లా పెద్దమందాడిలో అత్యధికంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. గురువారం మలక్కా ్రైస్టెట్ మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొన్నది. దీని ప్రభావంతో శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని తెలిపింది. ఇది 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశలో కదిలి.. మరింత బలపడి ఈనెల 24న నాటికి వాయుగుండంగా మారనున్నదని పేర్కొన్నది. దీంతో వచ్చే మూడ్రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి వ ర్షాలు కురుస్తాయని తెలిపింది.