Naini Coal Block | ఒక మంత్రి వ్యవహారాలపై ఒక చానల్లో కథనం ఎందుకు వచ్చింది? ముందు నన్ను చంపేయండి అన్న సదరు మంత్రి.. ఆ తర్వాత ఎందుకు సదురుకున్నారు? దీని మీద ఆలిండియా సర్వీస్ అధికారులు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? ఇది ముగియకముందే మరో మంత్రిని టార్గెట్ చేస్తూ ముఖ్యనేత సన్నిహితుడి పత్రికలో ఎందుకు కొత్త కొత్త పలుకులు జాలువారాయి? ఎందుకు గట్టిమంత్రి తన సహజ ధోరణికి భిన్నంగా సవాళ్లు విసిరేందుకు సిద్ధపడ్డారు. ఇది కేవలం నైతిక సమస్యనా? ఈగోల సమస్యనా? పదవుల సమస్యనా? లేక వాటాల కోసం కొట్లాటనా? రాష్ట్రంలో గత కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలను లోతుగా తవ్వితే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాకరాక అధికారానికి వచ్చి ఆకలిగొన్నట్టు ఆబగా దోపిడీకి తెరలేపిన కాంగ్రెస్ నేతలు.. తాజాగా సింగరేణిని కొల్లగొట్టడానికి చేసిన ప్రయత్నంలో భాగమే ఈ కొట్లాటలకు అసలు కారణమని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. వాటాల పంచాయితీ తేలకే సదరు నేతలు వీధులకెక్కి వీరంగాలు వేస్తున్నారని అధికార వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి.
హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంలో పుట్టిన ‘బొగ్గు గనుల’ ముసలం వెనుక వాటాల పంచాయితీ ఉన్నదా? గనులను తమవారికే కట్టబెట్టేందుకు ముఖ్యనేత, గట్టి నేత, కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారా? చివరికి ఒప్పందానికి వచ్చి, ఏటా వచ్చే రూ.1600 కోట్ల ఆదాయాన్ని పంచుకునేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయా? అందుకే గట్టి మంత్రికి సన్నిహితంగా ఉండే మీడియా చానల్లో కీలక మంత్రి మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ కథనాలు ప్రసారం అయ్యాయా? వీటికి కౌంటర్‌గా ముఖ్యనేత తన సన్నిహితుడి మీడియా ద్వారా గట్టి మంత్రిని టార్గెట్ చేయించారా? సింగరేణిని గట్టి మంత్రి ఆధీనం నుంచి తప్పించి తన చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నారా? మొత్తంగా కోడెలు కోడెలు కొట్లాడి దూడల మీద పడ్డట్టు.. పెద్దల మధ్య పంపకాల పంచాయితీలో మహిళా ఐఏఎస్‌లు, జర్నలిస్టులు బలి పశువులు అయ్యారా? ప్రస్తుతం ప్రభుత్వంలో, రాజకీయ, జర్నలిస్టు వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఈ అంశంపై లోతుగా తవ్వినకొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
కాంట్రాక్టర్ల పాలిట బంగారు బాతు
ఒడిశాలోని అంగూల్ జిల్లాలో ఉన్న నైనీ కోల్‌బ్లాక్‌ను 2015లో సింగరేణి సంస్థ దక్కించుకున్నది. ఈ బ్లాక్ 2200 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. 200 ఎకరాల్లో ఓవర్ బర్డెన్ (ఓబీ) తొలగింపు టెండర్లను ఏపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి చెందిన కంపెనీ గతంలో సొంతం చేసుకున్నది. సింగరేణి సంస్థ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. మిగతా 2 వేల ఎకరాల్లో బొగ్గు వెలికితీతకు మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ (ఎండీఆర్) విధానంలో గతంలోనే టెండర్లు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత టెండర్లను రద్దుచేసి, కొత్తగా టెండర్లు పిలిచింది. ఈ నెల 29 వరకు దాఖలుకు అవకాశం ఉన్నది. వాస్తవానికి నైనీ బొగ్గు గని సింగరేణికి ఏమాత్రం లాభదాయం కాదని, కానీ కాంట్రాక్టర్లకు మాత్రం బంగారు బాతు అని అధికారులు చెప్తున్నారు. వారికి ఏడాదికి సగటున రూ.1600 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు నైనీ బ్లాక్‌లో 6 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికి తీసినట్టు చెప్తున్నారు.
ఈ బొగ్గును రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలోని జైపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న థర్మల్ పవర్‌ప్లాంట్(ఎస్టీపీపీ)కు తరలించాలి. నైనీ నుంచి జైపూర్‌కు రైలు మార్గం లేకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తరలిస్తే గిట్టుబాటు కాకపోవడంతో బొగ్గు గుట్టలుగా పేరుకుపోయిందని సమాచారం. నైనీ నుంచి ఇప్పటివరకు సింగరేణికి కిలో బొగ్గు చేరకపోయినా కాంట్రాక్టర్లకు మాత్రం ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన మట్టి ఎత్తిపోసే పనులతో (ఓబీ వర్క్)పాటు బొగ్గు తోడే పనులకు (ఎక్స్కవేషన్) సంబంధించిన టెండర్లను తమవారికి ఇప్పించుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టు చెప్తున్నారు. ముఖ్యనేత, గట్టి మంత్రి, తాజా వివాదంలో కేంద్ర బిందువుగా ఉన్న కీలక మంత్రి తమ అస్మదీయులకే కాంట్రాక్టు దక్కాలని మొండిపట్టు పట్టినట్టు తెలిసింది. ముఖ్యనేత సన్నిహితుడి కంపెనీకి గతంలోనే ఒక సింగరేణి టెండర్ దక్కిందని, అధిక లాభాలు వచ్చే నైని గని టెండర్ కూడా ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఆరోపణలున్నాయి. ముఖ్యనేత మీడియాలో తనకు వ్యతిరేకంగా కథనం రావటంతో ఇక టెండర్ ఎవరికీ దక్కవద్దనే ఉద్దేశంతో పూర్తిగా టెండర్లను రద్దుచేసినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా మూడు ముక్కలాట రచ్చ జరిగినట్టు ప్రచారం జరుగుతున్నది.
భాగస్వామికి దక్కించేందుకు ‘గట్టి’ ప్రయత్నాలు
కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 20 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న గట్టి మంత్రి.. కొంత కాలంగా సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారనే ప్రచారం ఉన్నది. సింగరేణికి గతంలో పనిచేసిన ఉన్నతాధికారికి, ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు ప్రచారంలో ఉన్నది. ఆయన సూచన మేరకే గట్టి మంత్రి తన బినామీల పేరుతో పెట్టుబడులు పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఓ మీడియా చానల్ అధిపతితో ఆయన వ్యాపార సంబంధాలు పెంచుకున్నారని చెప్పుకుంటున్నారు. తన అల్లుడికి చెందిన మైనింగ్ కంపెనీకి టెండర్లు దక్కేలా మీడియా చానల్ అధిపతి చక్రం తిప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో కంపెనీతో కలిపి కన్సార్షియం ఏర్పాటు చేయించినట్టు చెప్తున్నారు. సదరు మీడియా అధిపతి రాష్ట్రంలోని బీజేపీ కీలక నేత ద్వారా కేంద్ర పెద్దలను ప్రసన్నం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు ఎవరికివారు వాటాలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీకి అనుకూలంగా నిబంధనలు రూపొందించారనే ప్రచారం ఉన్నది. దీంతో తన అల్లుడి కంపెనీకి టెండర్లు దక్కడం ఖాయమని మీడియా అధిపతి గట్టిగా నమ్మినట్టు తెలిసింది.
వాటాల లెక్క తేలక..
టెండర్ల కోసం పోటీ పెరుగుతుండటంతో ముఖ్యనేత బృందం రంగంలోకి దిగినట్టు తెలిసింది. ముఖ్యనేత, గట్టి మంత్రి, కీలక మంత్రికి సమానంగా వాటాలు పంచుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను గట్టి మంత్రి తిరస్కరించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సింగరేణిపై తన ఆధిపత్యం నడుస్తున్నదని, కాబట్టి పనులను తానే చేసకుంటానని, సమాన వాటాలు పంచటం కుదరదని గట్టి మంత్రి తేల్చిచెప్పినట్టు చర్చ జరుగుతున్నది. ఇతరుల శాఖల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, కాబట్టి ఈ విషయంలో ఇతరుల ప్రమేయం వద్దని ముఖం మీదే చెప్పారట. ముఖ్యనేత సన్నిహితుడి కంపెనీకి 25 శాతం, కీలక నేత సోదరుడి కంపెనీకి 10 శాతం వాటా ఇస్తానని, అంతకుమించి ఇచ్చేది లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో వివాదం ముదిరి పాకాన పడినట్టు సింగరేణి వర్గాలు చెప్పుకుంటున్నాయి. తన సోదరుడి కంపెనీకి దక్కే అవకాశం లేకపోవడంతో నిబంధనల్లోని తప్పిదాలను ఎత్తి చూపుతూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయటానికి కీలక మంత్రి సిద్ధమైనట్టు తెలిసింది.
దీంతో మీడియా అధిపతి అలర్ట్ అయ్యారని, కీలక మంత్రికి, మహిళా ఐఏఎస్‌లకు అనైతికత అంటగడుతూ తన చానల్లో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని ప్రచారం జరుగుతున్నది. మహిళా అధికారులపై కథనం ప్రసారం చేయడం బూమరాంగ్ అయిన సంగతి తెలిసిందే. దీంతో గట్టినేతను ఇరికించేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యనేత నిర్ణయించుకున్నారని, వెంటనే ఎల్లో మీడియాకు చెందిన తన సన్నిహితుడి ద్వారా కొత్త కొత్త పలుకులు జాలువారేలా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పిట్ట పోరు, పిట్ట పోరు పిల్లి తీర్చినట్టు ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటే టెండర్లు తన సన్నిహితుడికి దక్కేలా చేయాలని ముఖ్యనేత ప్లాన్ చేసినట్టు సమాచారం. అందుకే ఈ వివాదం మొత్తం గట్టి మంత్రి, కీలక మంత్రికి సంబంధించినదేనని, ముఖ్యనేతకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఆ కథనం ద్వారా ప్రచారం చేయించారని చెప్పుకుంటున్నారు. అయితే చానల్లో కథనంపై బ్యూరోక్రాట్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, కీలక మంత్రిపై సింపతీ పెరగడంతో తమ ప్లాన్ ఫెయిల్ అయిందని భావించి మొత్తం టెండర్లనే రద్దు చేయించారని ప్రచారం జరుగుతున్నది. వాటాల పంచాయితీ తేలకపోవడం వల్లే మంత్రుల కొట్లాట వీధిన పడిందని, బూతు కథనాలు, కౌంటర్లతో ప్రభుత్వం పరువు పోయిందని మిగతా మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం.
సోదరుడి కోసం కీలక మంత్రి
ఈ కాంట్రాక్టు పనుల కోసం ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి వర్గం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాం నుంచి తాను పోరాటం చేస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సారి టెండర్లు విడిచిపెట్టేది లేదని ఆయన గట్టి మంత్రికి తేల్చి చెప్పారట. అవసరమైతే మళ్లీ పోరాటం చేస్తానని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. టెండర్ల నిబంధనలలోని అవకతవకలపై కూడా ప్రశ్నించినట్టు సమాచారం.
గట్టి నేతకు చెక్‌పెట్టిన ముఖ్యనేత
నైనీ బ్లాక్ టెండర్ల ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే సింగరేణి ఉన్నతాధికారి డిప్యూటేషన్ పదవీ కాలం పూర్తయినట్టు సమాచారం. దీంతో తన గడువు మరోసారి పొడిగించాలని సదరు అధికారి గట్టి నేత, మీడియా అధిపతి ద్వారా ప్రయత్నించినట్టు సమాచారం. వారిద్దరూ కలిసి కేంద్రంలో పైరవీలు చేసి కొనసాగింపునకు ఒప్పించినట్టు చర్చ జరుగుతున్నది. మొదట్లో ముఖ్యనేతకు కూడా వాటా ఆశ పెట్టడంతో డిప్యూటేషన్ పొడగింపునకు సమ్మతించారని సమాచారం.
అయితే.. ముఖ్యనేత సన్నిహితులు ‘సైట్ విజిటింగ్’ టెండర్ల నిబంధనల గురించి తెలుసుకొని, ముఖ్యనేతను అప్రమత్తం చేసినట్టు తెలిసింది. అక్కడ వచ్చే లాభాల గురించి వివరించి, ఎలాగైనా టెండర్లు తమకే దక్కేలా చూడాలని కోరినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారి తీరుపై ముఖ్యనేత ఫైర్ అయ్యారని, డిప్యూటేషన్ పొడిగింపు ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా కేంద్ర ప్రభుత్వమే తిరస్కరించిందనే లీకులు ఇచ్చి, ఆంగ్ల పత్రికల్లో కథనాలు రాయించారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన మాతృశాఖకు వెళ్లిపోయినట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు గతంలో సింగరేణి వ్యవహారాలన్నీ ముఖ్యనేత ఆధీనంలో ఉండేవి, ఇప్పుడు గట్టి మంత్రి తన చేతిలోకి తీసుకున్నారు. గట్టి మంత్రి ఆర్థికంగా బలపడుతుండటం, సింగరేణిపై ఆధిపత్యం చెలాయిస్తుండటం, ఇప్పుడు నైనీబ్లాక్ టెండర్లు దక్కితే తనకు నష్టమని ముఖ్యనేత భావించారట. ఆ టెండర్లు తన సన్నిహితులకే దక్కితే లాభం మొత్తం తనకే వస్తుందని అనుకున్నట్టు సమాచారం.