హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): సింగరేణి గనుల ప్రైవేటీకరణకు బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలపై ఉద్యమిద్దామని బొగ్గుగని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం కేటీఆర్‌తో బొగ్గుగని కార్మిక సంఘం నేతలు సమావేశమయ్యారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతోపాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి కేటీఆర్ మాట్లాడారు.
త్వరలో సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికులు, సంస్థ కోసం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్మికుల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ప్రభుత్వం ఏ కార్మికుడికైనా అన్యాయం చేస్తే.. చట్టబద్ధంగా ఎదురొనేందుకు లీగల్ సెల్ సహకారం అందిస్తుందని తెలిపారు.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీజీబీకేఎస్) ఇన్చార్జిగా బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కేటీఆర్ ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను బీఆర్ఎస్ పార్టీ తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఆదేశించారు.