మహబూబ్నగర్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాక్షాత్తు సీఎం సొంత నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పురుగుల అన్నాన్ని వడ్డించడం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన విద్యార్థులకు అన్నంలో పురుగులు ప్రత్యక్షమవడంతో భోజనం చేయకుండా అలాగే వదిలేశారు. ఈ విషయంపై వంట ఏజెన్సీని నిలదీస్తే… నోరు మూసుకొని తినండి అంటూ బెదిరించినట్టు విద్యార్థులు వాపోయారు. ఒకవైపు వందల మంది పోలీసు బలగాలతో హకీంపేటలో గ్రామసభ జరుగుతుండగా మరోవైపు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పురుగుల అన్నం పెట్టడం… అడిగితే ఎక్కడ పోలీసులకు పట్టిస్తారని భయంతో విద్యార్థులు పస్తులుండి పోయారు. ఈ విషయం బయటపడకుండా ఉపాధ్యాయులు, హెడ్మాస్టర్ విద్యార్థులను బెదిరించడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. వంట ఏజెన్సీకి బియ్యం సరఫరా చేయకపోవడంతో నిల్వ ఉన్న బియ్యాన్ని వండి పెట్టడంతో పురుగులు ప్రత్యక్షమైనట్టు తెలిసింది.