Assembly Session | హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వ్యక్తిగత దూషణలకు, దారిమళ్లింపు రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఈసారి బడ్జెట్ సమావేశాలు, బుధవారం సభావేదికగా చోటుచేసుకున్న పరిణామాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మాజీమంత్రి కేటీఆర్ చేసిన సుదీర్ఘ ప్రసంగం లో, ఆయన లేవనెత్తిన అంశాలపై తమ దగ్గర సరైన సమాధానం లేక సీఎం రేవంత్‌రెడ్డి తప్పించుకునేందుకు దారిమళ్లింపు రాజకీయ చర్యలకు పాల్పడ్డారని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. సీఎం రాజేసిన నిప్పుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నీళ్లు చల్లాల్సిందిపోయి మరింత రాజుకునేందుకు ఉప్పు వేశారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గుసగుసలాడుతున్నారు.
సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచీ..
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. బుధవారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేటీఆర్ సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లపాటు బీఆర్ఎస్ సర్కార్ ఆయా రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వాటి ఫలితాలను సభలో ప్రస్తావించారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు ఏ మేరకు నష్టం చేస్తాయో, వాటి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చేసిన వాగ్దానాన్ని గుర్తుచేస్తూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఫార్మాసిటీ కోసం రైతుల దగ్గరి నుంచి సేకరించిన భూములను తిరిగి ఇస్తారా? అని ప్రశ్నించారు. ఈ అంశాల పరంపర కొనసాగుతున్న క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సభలో దుమారాన్ని రేపాయి. వీటికితోడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు, మోటర్లపై మీటర్లు, పులిచింతల ప్రాజెక్టుల తదితర విషయాల్లో సీఎం సభను ఉద్దేశపూర్వకంగానే తప్పుదారి పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించిన విషయం తెలిసిందే.
హుందాతనంతో కేటీఆర్.. భేషజంతో రేవంత్
కేటీఆర్ హుందాతనంతో వ్యవహరించారని, అదే సీఎం రేవంత్‌రెడ్డి భేషజాలకు పోతున్నారని స్వయంగా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలే వాపోతున్నారు. కేటీఆర్ ప్రసంగంలో రేవంత్.. అని ఒక దశలో సంభోదించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టారు. ఒక దశలో స్పీకర్ సైతం సభానాయకుడిని ఏకవచనంతో సంభోదించకూడదని అన్నారు. దీంతో కేటీఆర్ గతంలో తనకున్న చనువుతో అలా అన్నానని, ఒకవేళ తన మాటలు సరికాదని భావిస్తే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుర్తుచేస్తూనే సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై పెదవి విరుస్తున్నారు. సభానాయకుడిగా సీఎం హుందాగా వ్యవహరించాల్సిందిపోయి అసందర్భోచితంగా వివాదాలకు కారణం అవుతున్నారని పేర్కొంటున్నారు.
బెడిసికొట్టిన వ్యూహం
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన జరుగుతుండగానే ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. చర్చలో ఎంఐఎం, బీజేపీ, సీపీఐ తమ అభిప్రాయం వెల్లడించకుండానే, అధికార పక్షం నుంచి ఎటువంటి క్లారిఫికేషన్స్ లేకుండానే ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం వాయువేగంతో జరిగిపోయింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య సభను స్పీకర్ గురువారానికి వాయిదా వేశారు. బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి నినాదాలు చేస్తూ మీడియా పాయింట్ వద్ద సర్కారు తీరును మీడియాకు వివరించే అవకాశం ఉందని గ్రహించిన అధికారపక్షం నేతలు.. మీడియా పాయింట్ వద్ద ప్రసంగించటం మొదలుపెట్టారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా మూడు వేర్వేరు బృందాల్లో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యేలు జీ మధుసూదన్‌రెడ్డి, కే శంకరయ్య, బాలునాయక్, విజయరమణారావు, యశస్వినీరెడ్డి, మట్టా రాగమయి, చిట్టెం పర్ణికారెడ్డి, కుంభం అనిల్‌కుమార్, వాకిటి శ్రీహరి, మందుల సామేలు తదితరులు మీడియా పాయింట్లో ప్రసంగించారు. అయితే, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద సహా పలువురు ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ ఆవరణలోకి రాగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేల వద్దనున్న కెమెరాలు బీఆర్ఎస్ తిరగటం గమనార్హం. దీంతో మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడించొద్దనే కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టిందనే గుసగుసలు వినిపించాయి.
ముదిరాజ్‌లను బీసీ ఏలో చేర్చాలి
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీ మేరకు బీసీ-బీలో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలో చేర్చాలి. జనగణన చేసి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలి. సుప్రీంకోర్టు లో ఉన్నదని ప్రభుత్వం దాటవేస్తున్నది.
– ఎమ్మెల్సీ తాతా మధు
పీహెచ్సీలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి
రాష్ట్రంలో డయాలసిస్ రోగు ల సంఖ్య పెరిగిం ది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 3 డ యాలసిస్ కేంద్రా లు ఉంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం వాటి సంఖ్యను 104కి పెంచింది. కేసీఆర్ కి ట్, న్యూట్రిషన్ కిట్లు నిలిచిపోవడంతో రాష్ట్రంలో సిజేరియన్ కాన్సుల సంఖ్య పెరిగింది. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు, కంటి వెలుగు కొనసాగించాలి.
– ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి
సింగూరు జలాలను సరఫరా చేయాలి
ఉమ్మడి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు సరఫరా చేసి రైతులను ఆదుకోవాలి. కొండపోచమ్మ నుంచి నీటిని ఎత్తిపోయకపోవడం వల్ల కాల్వలు ఎండిపోతున్నాయి. సింగూరు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి.
– ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచాలి. ఉపాధ్యాయుల నియామకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ అస్తవ్యస్థంగా మారింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. పాఠశాలల్లో వసతులకు బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంచాలి.
– ఎమ్మెల్సీ వాణీదేవి
పిచ్చికుక్కలు, కోతుల సమస్యను అరికట్టాలి
రా్రష్ట్రంలో పిచ్చికుక్కలు, కోతుల బెడదతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో కుక్క కాటుకు ముగ్గురు చనిపోయారు. కోతుల వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. కుక్కలు, కోతుల నియంత్రణకు ప్రభుత్వం ఒక పాలసీని రూపొందించాలి.
– ఎమ్మెల్సీ రవీందర్రావు
చేనేతలను ఆదుకోవాలి
రాష్ట్రంలో చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలతో చేనేత కార్మికులకు ఉపాధి కల్పించారు. ప్రభుత్వానికి బతుకమ్మ పేరు ఇబ్బందికరంగా ఉంటే .. మరో పేరుతోనైనా చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇచ్చి ఉపాధి కల్పించాలి.
– ఎమ్మెల్సీ ఎల్ రమణ
గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వాలి
రాష్ట్రంలోని గొల్ల కుర్మలకు పెండింగ్‌లో ఉన్న గొర్రెల యూనిట్లను మంజూరు చేయాలి. సుమారు 3 లక్షల మంది యూనిట్‌కు రూ.40వేలు డిపాజిట్‌గా చెల్లించారు. అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షించి, లబ్ధిదారులకు న్యాయం చేయాలి. కాపరులకు బీమా సౌకర్యం కల్పించాలి.
– ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం
ఉపాధ్యాయుల కొరత ఉంది
ఎయిడెడ్ పాఠశాలల్లో ఇటీవల ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. వారి స్థానంలో ఇప్పటికీ కొత్తవారిని నియమించలేదు. దీనివల్ల ఉపాధ్యాయుల కొరత నెలకొంటున్నది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి. విద్యార్థులకు నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలి.
– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి