హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 9 హామీలతోపాటు ఉద్యోగుల 41 డిమాండ్లపై 21లోగా ఏదో ఒకటి తేల్చాలని ఉద్యోగుల జేఏసీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. లేకపోతే 22న కార్యాచరణ ప్రకటిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావొస్తున్నా ఒక్క సమస్య పరిష్కారంకాకపోవడంతో ఉద్యోగులంతా అసంతృప్తిగా ఉన్నారని జేఏసీ నేతలు శుక్రవారం వెల్లడించారు. సచివాలయంలో సీఎంవో కార్యదర్శి శేషాద్రిని కలిసి నోటీసు అందజేశారు.
ఆ తర్వాత నాంపల్లి టీఎన్జీవో భవన్లో జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. తమ 50 డిమాండ్లపై ప్రభుత్వాన్ని, మంత్రులను కలిసి వినతిపత్రాలిచ్చినా సానుకూల స్పందన కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. వరద బాధితులకు సహాయం ప్రకటించిన రోజు, రెండు మూడు రోజుల్లోనే సమస్యల పరిష్కారానికి విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపురాకపోవడం బాధాకరమని వాపోయారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేకపోతే కార్యాచరణను ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీనివాసరావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ శ్రీపాల్‌రెడ్డి, సదానందంగౌడ్, అంజిరెడ్డి, శ్యామల్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.