ఖమ్మం, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలకు ప్రజలు లక్షలాదిగా తరలి వచ్చారు. సభా ప్రాంగణాలు జన సునామీలను తలపించాయి. ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను చూసేందుకు జనం ముందుగానే వేదిక వద్దకు చేరుకున్నారు. కేసీఆర్ సభావేదికపైకి వచ్చే వరకు వారంతా ఓపికగా కూర్చున్నారు. భారీ ఏర్పాట్లు చేయడంతో రెండుచోట్లా వీధులన్నీ గులాబీమయమయ్యాయి. కేసీఆర్ ప్రత్యర్థులను ఉద్దేశించి వదిలిన వాగ్బాణాలకు సభికుల నుంచి కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా కేసీఆర్‌కు జైకొట్టారు. కొత్తగూడెం సభలో తెలంగాణ ఉద్యమ సమయంలో కొత్తగూడెం ప్రజలు నిర్వహించిన పాత్రను కొనియాడగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక పోతే కొత్తగూడెం జిల్లా అయ్యేదా? పోడు భూములకు పట్టాలు వచ్చేవా? ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చేనా? అంటూ చేసిన ప్రసంగానికి సభ చప్పట్లతో మార్మోగింది. కొత్తగూడెంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాను, ఖమ్మంలో అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను గెలిపించి రాజకీయ చైతన్యాన్ని చాటాలని సీఎం కేసీఆర్ పిలుపునివ్వగా పార్టీ శ్రేణులు ప్రతిస్పందించాయి. కాంగ్రెస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్లను ప్రస్తావించకుండానే పరోక్షంగా సీఎం కేసీఆర్ వారిపై మాటల దాడి చేశారు. సీఎం వ్యాఖ్యలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది.
‘భద్రాద్రి సీతారామచంద్రస్వామి కొలువుదీరిన ఈ పావనభూమికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. ఆ స్వామి పేరు మీదనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం. ఈ జిల్లా అభివృద్ధి బాధ్యత నాది. అభ్యర్థి వనమా అయినా.. నన్ను చూసి ఓటు వేయండి’
– ముఖ్యమంత్రి కేసీఆర్