హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills By-Election) ఓటమి భయం పట్టుకున్న సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi) ఇంటికి వెళ్లినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రచారానికి రావాలని ఆయనను వేడుకున్నట్టు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతున్నది. సొంత సర్వేలు, ప్రైవేటు సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయమని చెప్తుండటంతో ఏం చేయాలో సీఎం రేవంత్‌రెడ్డికి దిక్కుతోచడం లేదని తెలిసింది. దీంతో ఎంఐఎం నేతల శరణుజొచ్చినట్టు చర్చ జరుగుతున్నది. ఆయన ఆదివారం రాత్రి తన షాడోగా గుర్తింపు పొందిన నాయకుడిని మాత్రమే వెంట తీసుకొని ఒవైసీ ఫాంహౌస్‌కు వెళ్లినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసదుద్దీన్ ఒవైసీ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో, అందుబాటులో ఉన్న ఆయన సోదరుడు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని కలిసినట్టు తెలిసింది.
అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వటంలో తన ప్రమేయం ఏమీ లేదని, కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి వచ్చిన ఉత్తర్వులు అమలుచేయక తప్పలేదని సీఎం వివరణ ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. క్ష్రేత్రస్థాయిలో పరిస్థితులు బాగా లేవని, ముస్లిం ఓటర్లు గంపగుత్తగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అక్బరుద్దీన్‌కు సీఎం వివరించినట్టు తెలిసింది. ‘మీరు వచ్చి ఒక్కసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే పరిస్థితుల్లో మార్పు రావొచ్చు, నాతోపాటు ఒక్కసారి షోడ్షోలో పాల్గొనండి’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తిచేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే సీఎం విజ్ఙప్తిని అక్బరుద్దీన్ తిరస్కరించినట్టు తెలిసింది. తాను లండన్ వెళ్తున్నానని ఎన్నికల ప్రచారానికి రావటం అసాధ్యమని తేల్చిచెప్పినట్టు సమాచారం. అక్కడి నుంచే అసదుద్దీన్‌కు ఫోన్ చేయగా.. తాను బీహార్ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడుతానని చెప్పినట్టు సమాచారం. దీంతో చేసేదేం లేక సీఎం నిరాశతో వెనుతిరిగినట్టు తెలిసింది.