నిజామాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కవి దాశరథి కృష్ణమాచార్యులు నిజామాబాద్ గడ్డపై పుట్టారట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే. మహబూబూబాద్ జిల్లాలో పుట్టి, నిజాం పాలనను వ్యతిరేకిస్తూ నిజామాబాద్‌లో దాశరథి జైలు జీవితం గడిపితే.. ఇందూరులో జన్మించారంటూ చరిత్రను తెలియకుండా మాట్లాడారు. శుక్రవారం నిజామాబాద్‌లో ‘ప్రజాపాలన-ప్రగతిబాట’ కార్యక్రమంలో సీఎం చేసిన ఈ అవగాహన లేని వ్యాఖ్యలపై సభికులు ముక్కున వేలేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపి స్వరాష్ట్ర సాధకుడిగా ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా అణువణువూ తెలిసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను జాతిపితగా పిలుచుకుంటే ఓర్వలేని విషంకక్కే రేవంత్‌రెడ్డి బూతుభాషతో రెచ్చిపోవడం తప్ప.. చరిత్రపై కనీస అవగాహన లేకపోవడం విచారకరమని విశ్లేషకులు అంటున్నారు. పదేండ్ల పాలనలో వేదిక ఏదైనా అలవోకగా ఆ ప్రాంత విశేషాలు, చరిత్రే కాక పద్యాలను కంఠతా చెబుతూ జననేతగా, పాలకుడిగా కేసీఆర్ మెప్పించారని.. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చరిత్రను వక్రీకరిస్తూ తెలంగాణకే తలవంపులు తెస్తున్నారంటూ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో కనీసం ఒక జిల్లాకు ఎవరు ఎన్నికల ఇన్చార్జిగా ఉన్నారో కూడా తెలియకపోవడం పాలనపై ముఖ్యమంత్రికి ఎంత పట్టు ఉన్నదో తెలియజేస్తున్నదని వారు అభిప్రాయపడ్డారు.
పేరుకు ఇది అధికారిక కార్యక్రమమైనా సీఎం సహా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, వేణుగోపాల్రావులందరూ ఓట్లు అభ్యర్థిస్తూ ఫక్తు రాజకీయ సభలా మార్చేశారు. అదే సభలో రేవంత్‌రెడ్డి మళ్లీ అవే అబద్ధాలు, విషపు కూతలతో ప్రతిపక్ష బీఆర్ఎస్పై అక్కసు వెల్లగక్కారు. సీఎం ప్రసంగం ఆద్యంతం బీజేపీపై తూతూమంత్రంగా విమర్శలు చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్పైనా గాలిమాటలతోనే సరిపెట్టారు. తన పేరును రేవంతుద్దీన్ అంటూ బీజేపీ అధ్యక్షుడు సంభోదించడంపై స్పందించిన సీఎం.. ఆ పేరును స్వీకరించినట్టు ప్రకటించారు. వేదికపై ఆసీనులైన మంత్రులు తుమ్మల, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లను ప్రస్తావిస్తూ మరో తప్పిదం చేశారు. ప్రసంగం మొదట్లోనే నిజామాబాద్ ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటూ ప్రస్తావించారు. వాస్తవానికి ఇన్చార్జి మంత్రిగా సీతక్క కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమానికి సీతక్క హా జరుకాకపోవడం చర్చనీయాంశమైంది. ము న్సిపల్ ఎన్నికలకు నిజామాబాద్ ఇన్చార్జిగా మాత్రమే ఉత్తమ్ ఉన్నారు. రేవంత్ ప్రసంగం చివరి దాకా ఇలా గందరగోళంగా సాగింది. మరోసారి బీఆర్ఎస్, బీజేపీల విమర్శిస్తున్న క్రమంలో అవిభక్త కవల పిల్లల పేర్లను ప్రస్తావించడాన్ని సభికులు తీవ్రంగా తప్పుబట్టారు. అదీగాక కేసీఆర్ హయాంలో దొడ్డు బియ్యాన్ని బర్ల(పశువుల)కు పెట్టే వారంటూ రేషన్ బియ్యం తినే పేద వర్గాలను కించపర్చారు.
ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 6: అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యమిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రెండేండ్లలోనే 70వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం బర్ధిపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన-ప్రగతిబాట కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఇందల్వాయి నివాస గృహాలు, అదనపు సౌకర్యాల నిర్మాణానికి రూ.600 కోట్లతో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ నిర్మాణాలకు, తెలంగాణ వర్సిటీలో రూ.1.36 కోట్లతో ఇండోర్ స్టేడియం, రూ.43కోట్లతో ఆడిటోరియం, పరిపాలన, సీఎస్ఈ భవనవిస్తరణ పనులు, రూ.21 కోట్లతో రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.18కోట్లతో నిర్మించిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. 1614 స్వయం సహాయక సంఘాలకు రూ.200కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. విధి నిర్వహణలో మృతిచెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్‌కుమార్ కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను అందజేశారు.