హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ స్కూళ్లను కీర్తిస్తూ.. సర్కార్ బడులను కించపరుస్తూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎంగా.. విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ప్రైవేట్ స్కూళ్లకు వంతపాడటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నెలకొల్పిన ప్రైవేట్ పాఠశాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. ‘ప్రైవేట్ విద్యాసంస్థలుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ప్రైవేట్ స్కూళ్లల్లో నెలకు మూడు నాలుగువేల లోపే ఫీజులున్నాయి. సర్కార్ ఒక్కో విద్యార్థిపై రూ. 1.08లక్షలు ఖర్చుచేస్తున్నా సరిగ్గా చదువలేకపోతున్నారు’ అంటూ వ్యాఖ్యానించారు. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి.
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు దోపిడీ చేస్తుండగా, సీఎం నెలకు మూడు, నాలుగు వేల లోపే ఉన్నాయని అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కార్పొరేట్ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, లక్షలకు లక్షల ఫీజుల దోపిడీ ముఖ్యమంత్రికి కనిపించడంలేదా? అంటూ విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం సీఎం రేవంత్ విద్యావిధానంపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఫీజుల నియంత్రణ చట్టంపైనే చర్చించారు. ఫీజు పరిధి దాటితే స్కూళ్ల అనుమతి రద్దుచేస్తామని హెచ్చరించారు. దోపిడీ నుంచి తల్లిదండ్రులను కాపాడుతామని వ్యాఖ్యానించారు. ఇప్పుడేమో నెలకు 3-4వేల లోపు ఫీజులున్నాయనడం సీఎం స్థాయికి తగదని అభిప్రాయపడుతున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలుంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటే.. మరీ కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఎందుకు కడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వ విద్యను కించపరిచారు : యూటీఎఫ్
విద్యాశాఖ మంత్రి కూడా అయిన సీఎం కార్పొరేట్ స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై టీఎస్ యూటీఎఫ్ అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రైవేట్ స్కూళ్లకంటే.. సర్కార్ బడుల్లోనే ఖర్చు అధికంగా ఉందని వ్యాఖ్యానించి సీఎం ప్రభుత్వ విద్యను కించపరిచారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఏ వెంకట్ అభిప్రాయపడ్డారు. అసర్, న్యాస్ సర్వేల్లో ప్రైవేట్‌లో, ప్రభుత్వ పాఠశాలల్లో అభ్యసనా సామర్థ్యాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. దీన్ని విస్మరించి కేవలం ప్రభుత్వ బడుల్లోనే అభ్యసన సామర్థ్యాలు తక్కువున్నాయని అనడం సర్కార్ బడులను నిర్వీర్యం చేసేందుకే దోహదపడుతుందని విమర్శించారు. బడ్జెట్లో విద్యకు 15% కేటాయిస్తామని 8.2% మాత్రమే కేటాయించి మోసం చేశారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు.
కార్పొరేట్‌కు బ్రాండ్ అంబాసిడర్లా సీఎం తీరు : ఏబీవీపీ
కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లా సీఎం రేవంత్ తీరు ఉందని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆరోపించింది. సీఎం వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేసింది. కార్పొరేట్, ప్రైవేట్ మాఫియా తల్లిదండ్రుల రక్తమాంసాలను పీల్చి పిప్పిచేస్తుంటే.. ఫీజుల తక్కువగా ఉన్నాయనడం గర్హనీయమని సంఘం రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అభిప్రాయపడ్డారు. రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.