Kodangal | వికారాబాద్, ఆగస్టు 21, (నమస్తే తెలంగాణ): ‘జోగులాంబ నుంచి మొదలుకుని ఏడుపాయల దాకా’ కనిపించిన దేవుళ్లమీద ఒట్టేసి చెప్పిండు సీఎం రేవంత్‌రెడ్డి.. పంద్రాగస్టుకల్లా రైతులందరికీ రుణమాఫీ చేస్తానని. మూడు విడతల్లో మాఫీ జాబితాలు విడుదల చేసినా.. రాష్ట్రంలో రైతులందరికీ సంపూర్ణంగా రుణమాఫీ కాలేదు. కనీసం సీఎం రేవంత్‌రెడ్డికి ఓటేసి గెలిపించిన కొడంగల్ నియోజకవర్గ రైతులకైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందా ? అంటే అదీ లేదని రైతులు సమాధానమిస్తున్నారు.
సీఎం సొంతనియోజకవర్గమైన కొడంగల్‌లో 35.54శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. రేవంత్‌రెడ్డికి ఓటేసిన పాపానికి వృద్ధులు మొదలుకొని మహిళలు, పిల్లలు సహా వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నామని కొడంగల్ రైతులు వాపోతున్నారు. కొడంగల్ గడ్డపై ప్రేముంటే ముందు ఇక్కడి రైతుల రుణం తీర్చుకోవాలని కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాసుపేట్, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లో ఆయా బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు 52,305 మంది ఉన్నారు. వీరిలో 18,407 మంది మాత్రమే రుణమాఫీ పూర్తయ్యింది. మిగతా 33,898 మంది రైతులు రుణమాఫీకి దూరమయ్యారు. జిల్లావ్యాప్తంగా రుణమాఫీ గ్రీవెన్స్‌కు సుమారు 5 వేల దరఖాస్తులు అందినట్టు వ్యవసాయాధికారులు వెల్లడించారు.
మాఫీ అంతా మాయ
సీఎం రేవంత్‌రెడ్డి పక్రటించిన రైతు రుణమాఫీ అంతా మాయగా ఉంది. ఎవరికి మాఫీ అయ్యిందో తెలియడం లేదు. రూ.2లక్షల రుణమాఫీ అన్నారు.. కానీ లక్షలోపు కూడా లబ్ధి కాలేదు. మా రుద్రారం రైతులు కొడంగల్ వ్యవసాయ కార్యాలయానికి పరుగులు పెట్టాల్సి వస్తున్నది. ఏఈవోల బదిలీతో మాఫీ ఎందుకు కాలేదో తెలుసుకోవడం కష్టంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం సగం మందికి కూడా రుణమాఫీ చేయలేదు.
– రాఘవేందర్‌రెడ్డి, రుద్రారం, కొడంగల్
తెల్వదంటే ఎవరిని అడగాలి ?
నా పేరు మీద రూ.25వేలు, నా భార్య మల్లమ్మ పేరు మీద 65,500లు మొత్తంగా 90,500ల అప్పు ఉంది. మా ఇద్దరిలో ఏ ఒక్కరికీ రుణమాఫీ జరగలే. బ్యాంకుకు పోయి అడిగితే లిస్టులో పేరు లేదు.. మాకు తెల్వదంటున్నారు. మరి ఎవరిని అడగాలి.. ఎక్కడికెళ్లి కలవాలి.. అర్హత ఉన్నప్పటికీ మాఫీ కాలేదు.
– ఎరుకలి పెద్ద ఆశన్న, హస్నాబాద్, కొడంగల్
మాఫీ మాటల్లోనే.. చేతల్లో కాదు
నేను కొడంగల్ ఎస్బీఐలో రూ.1.40 లక్షలు, నా కొడుకు దయాకర్ రూ.90 వేలు పంట రుణం తీసుకున్నాం. రేషన్‌కార్డును ప్రాతిపదికగా తీసుకున్నా ఇద్దరిలో ఒకరికైనా మాఫీ కావాలి. ఇద్దరికీ కాలేదు. ఇదేం రుణమాఫీయో అర్థం కావడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మాటల్లోనే ఉంది. చేతల్లో లేదు.
-గోవింద్‌రెడ్డి, రేగడిమైలారం, బొంరాస్‌పేట మండలం
మాఫీ కోసం తిరుగుతున్నా
బొంరాస్‌పేట ఎస్బీఐలో రెండేండ్ల కింద రూ.1.80 లక్షల పం ట రుణం తీసుకున్నా. ప్రభుత్వం చెప్పిన కటాఫ్ తేదీ ప్రకారం నాకు రుణమాఫీ కావాలి. కానీ జాబితాలో నా పేరు లేదు. ఎందుకు కాలేదో అడుగుదామని అధికారుల వద్దకు తిరుగుతున్నా.
-గోరుపల్లి క్రిష్ణయ్య, మదన్‌పల్లి, బొంరాస్‌పేట మండలం