హెచ్‌సీయూలో బుల్డోజర్లు అబద్ధం.. జింకల పరుగులు అబద్ధం.. నెమళ్ల అరుపులు అబద్ధం.. అంతా అబద్ధం!
– సీఎం రేవంత్ సమీక్షలో ప్రభుత్వ వాదన ఇది
ఏది అబద్ధం? యుద్ధ ట్యాంకుల్లా హెచ్సీయూపైకి వెళ్లిన బుల్డోజర్లు అబద్ధమా? రాత్రిళ్లు పచ్చని చెట్లను కూకటివేళ్లతో పెకిలించడం అబద్ధమా? ప్రాణ భయంతో జింకల బతుకు పరుగు అబద్ధమా? నెమళ్ల ఆర్తనాదాలు అబద్ధమా? విద్యార్థుల ఆందోళనలు అబద్ధమా? విద్యార్థులపై పోలీసుల లాఠీ దెబ్బలు అబద్ధమా? విద్యార్థులపై పెట్టిన కేసులు అబద్ధమా?
– ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికుల ప్రశ్న!
Revanth Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూ భూముల విషయంలో కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను సైతం అసత్య ప్రచారమంటూ ప్రభుత్వం వాదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హెచ్‌సీయూ ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్‌రెడ్డి, అక్కడ జరిగినవన్నీ అబద్ధాలే అనే విధంగా శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. అక్కడ ప్రభుత్వ తప్పేమీ లేదన్నట్టు.. తప్పంతా విద్యార్థులది, ప్రకృతి ప్రేమికులది, పశు పక్షాలదే అన్నట్టుగా సమీక్షలో ఆవేదన, ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటిదాకా జరిగిందంతా ఏఐ మాయ అన్నట్టుగా సీఎంకు వివరించారు.
అంతా ఏఐ మాయనట!
ఏఐ ద్వారా లేనివి ఉన్నట్టుగా వీడియోలు, ఫొటోలు సృష్టించి కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయటంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసిందని అధికారులు సీఎంకు వివరించారు. వివిధ రంగాల్లో పేరొందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టడంతో అబద్ధాలకు ఆజ్యం పోసినట్టయిందని తేల్చేశారు. కంచ గచ్చిబౌలిలో ఏఐ సృష్టించిన వివాదం ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను సవాలు విసిరిందని అభిప్రాయపడ్డారు. ఏఐతో ఫేక్ కంటెంట్ సృష్టిస్తే భవిష్యత్తుల్లో ఇండో-పాక్, ఇండో-చైనా వివాదాలు, యుద్ధాలకు కూడా దారితీసే ప్రమాదమున్నదన్నట్టుగా చర్చించారు. ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, ఏఐ ఫేక్ కంటెంట్‌ను పసిగట్టేలా అవసరమైన సాంకేతికతను సమకూర్చుకోవాలని సూచించారు.