యాదాద్రి భువనగిరి, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు’ అన్నట్టుంది రేవంత్ సర్కారు తీరు. బీఆర్ఎస్ హయాంలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకే మళ్లీ మళ్లీ భూమిపూజ చేస్తూ సీఎం రేవంత్ అభాసుపాలవుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో శుక్రవారం పలు అభ్రివృద్ధి కార్యక్రమాలకు రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అందులో గంధమల్ల రిజర్వాయర్ కూడా ఒకటి. బీఆర్ఎస్ హయాంలోనే దీనికి ప్రతిపాదనలు వచ్చాయి. దీని ద్వారా సుమారు 50 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయని భావించారు.
2017లో 9.8 టీఎంసీలతో ప్రతిపాదనలు పంపించారు. అప్పటి సర్కారు రూ. 800 కోట్లతో పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా 2,450 క్యూసెక్కుల నీరు గంధమల్లకు చేరేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే అక్కడ కరెంట్ స్తంభాలు ఉండటంతో రిజర్వాయర్‌ను కుదించారు. ఆ తర్వాత 2018లో 4.28 టీఎంసీలకు తగ్గించగా, 2019 భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
అనంతరం వివిధ కారణాలతో 2022లో 1.41టీఎంసీలకు తగ్గించి ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదే ప్రతిపాదనకు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 575.55 కోట్లతో మంజూరు ఉత్తర్వులు జారీచేసింది. గంధమల్ల రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం. కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు చేరిన నీరు అక్కడి నుంచి పలు ప్యాకేజీలకు చేరుతుంది. ప్యాకేజీ-14లో భాగంగా కొండపోచమ్మ సాగర్‌కు, ప్యాకేజీ-15లో గంధమల్లకు చేరుతుంది.
ప్యాకేజీలో-16లో భాగంగా ఇప్పటికే బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం చివరి దశకు చేరింది. గంధమల్లకు నీళ్లు రావాలన్నా కాళేశ్వరమే దిక్కు. కానీ, కాళేశ్వరం కూలిందంటూ గతంలో సీఎం, మంత్రులు విమర్శలు చేశారు. ఇప్పుడు అదే కాళేశ్వరం నుంచి గంధమల్లకు నీరు ఎలా తరలిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.
ఆలేరు మండలం కొలనుపాకలో హైలెవల్ బ్రిడ్జి, రాజపేట మండలం కాల్వపల్లిలో హైలెవల్ బ్రిడ్జి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయి. ఈ రెండు బ్రిడ్జీలకు గత ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపనలు చేశా రు. కొలనుపాక బ్రిడ్జికి ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కొత్తగా కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన సోషల్ మీడి యా ఖాతాల్లో ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ రేవంత్‌తో రెండు బ్రిడ్జిలకు శంకుస్థాపనలు చేయించడం గమనార్హం.
తెలంగాణ ఏర్పాటు తర్వాత నాటి బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీలు ఏర్పాటుచేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు 2023 జూలై 6న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జీవో నంబర్ 85ను విడుదల చేసింది. 100 సీట్ల సామర్థ్యంతో కాలేజీ ఏర్పాటు చేస్తామని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభమవుతాయని జీవోలో పేర్కొన్నది. ఆ తర్వాత లక్ష్మీనరసింహస్వామి మెడికల్ కాలేజీగా నామకరణం చేశారు. కాలేజీ నిర్మాణానికి రూ.183 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పుడు ఇదే కాలేజీకి రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అయితే కాంగ్రెస్ ఈ కాలేజీని కుదించి జిల్లాకు అన్యాయం చేసింది. ఎంబీబీఎస్ సీట్లను 50కి తగ్గించడమే కాకుండా 300 పడకల దవాఖానను 220 పడకలకు పరిమితం చేసింది.