Hyderabad Metro | హైదరాబాద్, జూన్ 15(నమస్తే తెలంగాణ): మెట్రో ఫేజ్-2 విస్తరణ కోసం అతి తక్కువకు కేవలం 4శాతం వడ్డీకే రుణం తీసుకొస్తున్నామని, సంస్థను లాభాల బాట పట్టిస్తామంటూ ఇంతకాలం ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పుడు నాలుక మడతేశారు. రుణం ఉత్తముచ్చటేనని, 8-11శాతం వడ్డీకి రుణం తీసుకోక తప్పదని చెప్పకనే చెప్పారు. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఇప్పుడు ప్రతిపక్షంపై నెపం మోపుతున్నారు.
సచివాలయంలో మంత్రులు సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, అజారుద్దీన్, వాకిటి శ్రీహరితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రత్యేకంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా మెట్రో ఫేజ్-2 విస్తరణ అంశంపై మాట్లాడారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో జనాభా 1.34 కోట్లకు చేరుకున్నందున, ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో విస్తరణ తప్పక చేపట్టాలని ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక, పట్టణాభివృద్ధి, రైల్వే శాఖల మంత్రులను కలిసి విన్నవించామని తెలిపారు. కేంద్రం సూచనల మేరకు అన్ని ప్రక్రియలను పూర్తి చేశామని, సంస్థలతో ఒప్పందాలు పూర్తి చేసుకోవడంతోపాటు, ఫీజులు కూడా చెల్లించామని వెల్లడించారు.
ఎల్అండ్టీ సంస్థకు చెందిన రూ.13,600కోట్ల బ్యాంక్ రుణాలు చెల్లించాల్సి ఉన్నదని, ఆ నిధులను 4శాతం వడ్డీతోనే సమకూర్చేందుకు ఓ జపాన్ కంపెనీ, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ)తో ఒప్పందాలు కూడా కుదిరాయని సైతం చెప్పారు. ప్రస్తుతం ఆ నిధులను ఐఆర్ఎఫ్సీ విడుదల చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు.
మరి మెట్రో భవితవ్యం ఏమిటి? అని పలువురు విలేకరులు ప్రశ్నించగా, 8-11శాతం వడ్డీకి రుణాలను సమీకరించుకొని, సంస్థకు చెల్లించాల్సిందేనని స్వయంగా ముఖ్యమంత్రే తేల్చిచెప్పారు. దీంతో ఇంతకాలం 4శాతం వడ్డీకే రుణాలను తీసుకొస్తున్నామని ఊదరగొట్టిన మాటలన్నీ ఉత్తవేనని స్వయంగానే ముఖ్యమంత్రే అంగీకరించారు. ప్రస్తుతం ఎల్అండ్టీ సంస్థ సైతం అదే తరహాలో రుణాలను తీసుకోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే రుణం రాకపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ఆరోపణలకు దిగారు. అయితే తక్కువ వడ్డీకే రుణాలను తీసుకొస్తున్నామని ఊదరగొట్టి, పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతున్నది. సమావేశంలో మంత్రులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.