హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీ కలిసే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మొదట ఏసీబీ, తర్వాత ఈడీ, మళ్లీ ఏసీబీ విచారణ అంటూ వెబ్‌సిరీస్ నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ ఈవెంట్ ఫార్ములా ఈ-రేస్‌ను దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు తెచ్చిన కేటీఆర్‌ను టార్గెట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఫార్ములా-ఈ కారు రేస్ కంపెనీకి నగదు చెల్లింపుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని స్పష్టంచేశారు. ఎఫ్ఐఆర్లోనూ అవినీతి ప్రస్తావనే లేదని గుర్తుచేశారు. సదరు ఈవెంట్ కంపెనీ తనకు లంచమివ్వజూపిందని అసెంబ్లీసాక్షిగా ఆరోపణలు చేసిన సీఎం..ఈ విషయంపై దర్యాప్తు సంస్థలకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఫార్ములా-ఈ రేస్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తే కేసీఆర్, కేటీఆర్‌కు మంచిపేరు వస్తుందనే ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను నిలిపివేశారని మండిపడ్డారు.
ఓర్వలేకే కక్ష సాధింపు..
కేటీఆర్ అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడతారని, దేశ, రాష్ట్ర ఖ్యాతిని ఎలుగెత్తి చాటడాన్ని ఓర్వలేకే సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. అభద్రతా భావంతో చిల్లర చేష్టలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఫార్ములా ఈ-రేసుతో 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా ప్రతీకార రాజకీయాలు పక్కనబెట్టి పెట్టుబడుల ఆకర్షణపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
మంకీన్ బయోతో బోగస్ ఒప్పందం..
సీఎం రేవంత్‌రెడ్డి బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదర్చుకుంటూ అవినీతిపర్వానికి తెరలేపారని క్రిశాంక్ ఆరోపించారు. కేవలం రూ. లక్ష మూలధనం కలిగి, యతిరాజం మధు శేషు అనే సీఏ పేరిట రిజిస్టర్ అయిన మంకీన్ బయో కంపెనీతో గత జూన్‌లో రూ. 345 కోట్లు పెట్టుబడులు పెట్టేలా అగ్రిమెంట్ చేసుకోవడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. ‘పిల్లగాడు పుట్టక ముందే కుల్ల కుట్టించిన’ చందంగా ఈ వ్యవహారం ఉన్నదని ఎద్దేవా చేశారు. కేసులు పెట్టాల్సింది ఫార్ములా ఈ -రేస్ తెచ్చిన కేటీఆర్‌పై కాదని, బోగస్ కంపెనీల పేరిట బాగోతాలు నడుపుతున్న వారిపై అని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే బోగస్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న రేవంత్ సర్కారుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని బుద్ధిచెప్పేందుకు తగిన సమయం కోసం ఎదురుచూస్తున్నారని హెచ్చరించారు.