Musi-HYDRAA |హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): మూసీ, హైడ్రాపై సీఎం రేవంత్‌రెడ్డిది ఒక మాటైతే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై వీరిద్దరు తలో మాట మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరి మధ్య సమన్వయం కరువైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం హైడ్రా, మూసీపై మీడియా సమావేశం నిర్వహించిన భట్టి విక్రమార్క పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు భిన్నంగా చెప్పడం గమనార్హం.
రేవంత్‌రెడ్డి: జూలై 20న గోపాన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘రూ. 1.5 లక్షల కోట్లతో మూసీ సుందరీకరణను చేపట్టనున్నాం. లండన్‌లోని థేమ్స్ నది మాదిరిగా మూసీని ప్రక్షాళన చేస్తాం’ అని తెలిపారు.
భట్టి విక్రమార్క: మూసీ సుందరీకరణకు అసలు డీపీఆర్ సిద్ధం కాకుండా, అంచనాలు వేయకుండా రూ.1.5 లక్షల కోట్ల బడ్జెట్ అంటూ ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి. అసలు మూసీ సుందరీకరణ బడ్జెట్ రూ.1.5 లక్షల కోట్లు అని ఎవరు చెప్పారు?
రేవంత్‌రెడ్డి: హైడ్రా కూల్చివేతలు కొనసాగుతాయి.
భట్టి విక్రమార్క: బఫర్ జోన్‌లోని ఇండ్ల జోలికి మేం వెళ్లడం లేదు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నవాటిపై మాత్రమే దృష్టిపెట్టినం.
రేవంత్‌రెడ్డి: మూసీ నిర్వాసితులను అక్కడి నుంచి తరలించి వేరే చోట డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తాం.
భట్టి విక్రమార్క: మూసీ నిర్వాసితులకు అక్కడే సొంతంగా ఇండ్లు కట్టించే ఆలోచన చేస్తున్నాం.
రేవంత్‌రెడ్డి: మూసీ నిర్వాసితులపై ఇప్పటికే సర్వే చేశాం. వారిని
తరలిస్తున్నాం.
భట్టి విక్రమార్క: మూసీ నిర్వాసితులకు సంబంధించి ఇంకా సర్వే చేస్తున్నాం. ఇప్పుడే ఎవర్నీ తరలించడం లేదు.