హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 12 ఎంపీ సీట్లు సాధించడం కాంగ్రెస్ పార్టీ టార్గెట్ అని ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు సాధించాలన్న లక్ష్యంతో ప్రతి ఒక్కరూ రెట్టింపు ఉత్సాహంతో కష్టపడాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికలపై సోమవారం సాయంత్రం ఎంసీహెచ్చార్డీలో సంబందిత జిల్లా మంత్రులు, పార్లమెంట్ ఎన్నికలకు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలిరోజు ఉమ్మడి హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాలోని లోక్సభ నియోజకవర్గాల నేతలతో చర్చించారు.
మంగళవారం మరో ఐదు ఉమ్మడి జిల్లాల్లోని ఎంపీ స్థానాలపై సమీక్ష నిర్వహించనున్నారు. సమావేశంలో ఆయా జిల్లాల ఇన్చార్జి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికలకు ప్రజలను, పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ఈ నెల 26 నుంచే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టబోతున్నట్టు వెల్లడించారు.
పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసభ నిర్వహించిన ఇంద్రవెల్లి నుంచే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతానని చెప్పారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మృతి వనం ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈ నెల 26 తర్వాత సచివాలయంలో వారానికి 3 రోజులపాటు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి, సంక్షేమం బాధ్యతలు ఉమ్మడి జిల్లాల ఇన్చార్జీ మంత్రులదేనని స్పష్టం చేశారు.