నారాయణపేట/గద్వాల/కొల్లాపూర్/ ఊట్కూరు, జూన్ 4 : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తొలిరోజు పర్యటన మమ అనిపించింది. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గురువారం మధ్యాహ్నం 3:15 గంటలకు నారాయణపేట జిల్లా మక్తల్‌కు కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజుతో కలసి నేరుగా ముఖ్యమంత్రి చేరుకున్నారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. మక్తల్ మండలం కాట్రేవుపల్లి సమీపంలో కొనసాగుతున్న నారాయణపేట- కొడంగల్ ఎతిపోతల పనులను పరిశీలించారు. ఈ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అనంతరం సాయంత్రం 4:15 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. గంట సమయంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు, మ్యాపుల పరిశీలన, ఫొటో ఎగ్జిబిషన్ల సందర్శన, కార్యకర్తలతో ఫొటోలు, అధికారులతో వాకబు చేశారు. మక్తల్ పర్యటన పోలీసు నిర్బంధంలోనే సాగిందని, ప్రజలకు అందుబాటులో లేకుండా ముఖ్యమంత్రి కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితమయ్యారని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలోని జూరాల, నెట్టెంపాడు, ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల, తుమ్మిళ్ల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల నీటి సామర్థ్యం, ఆయకట్టు పనుల పురోగతిపై సీఎంకు జూరాల ఎస్ఈ రహీముద్దీన్ వివరించారు. అనంతరం గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ను పరిశీలించారు. అయితే, సీఎం పూర్తిస్థాయిలో వీడియో ప్రజెంటేషన్ చూడకుండానే మధ్యలోనే లేచి వెళ్లి పోవడంతో నడిగడ్డపై సీఎంకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతున్నదని స్థానికులు విమర్శలు చేశారు. మొత్తంపై ముఖ్యమంత్రి పర్యటన టూరిస్టులా ఇలా వచ్చి.. అలా వెళ్లినట్టు ఉన్నది. భద్రతా కారణాల పేరుతో సీఎం పర్యటనకు మీడియాను అనుమతించలేదు. కొల్లాపూర్ మండలం సోమశిలకు వెళ్లకుండా గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో నిలిపివేశారు. కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే అనుమతి ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాలు అభ్యంతరాలు వ్యక్తంచేశాయి. నారాయణపేట జిల్లా మక్తల్‌లో సీఎం పర్యటనను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. గద్వాల జిల్లా బీఆర్ఎస్ నేత బాసు హనుమంతు నాయుడును గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయిజ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత నాగర్‌దొడ్డి వెంకట్రాములును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పనులను గురువారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడంలో భూసేకరణకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. భూసేకరణ విషయంలో స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఆయా జిల్లాల కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు.