హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : ‘కృష్ణాలో నీటి వాటాలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి దుర్మార్గపు ప్రచారం చేస్తున్నడు’ అంటూ హరీశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి తన సర్కారు, ఆ యన పార్టీ చేసిన పాపాలను కేసీఆర్‌పై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘రాష్ట్రం ఏర్పడ్డ 20 రోజుల్లోనే కేసీఆర్ కృష్ణాలో నీళ్లవాటా కోసం పోరాటం మొదలు పెట్టిండ్రు. ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసి పరీవాహక ఆధారంగా నీళ్లు పంచాలని ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని డిమాండ్ చేసిండ్రు. ప్రధాని మోదీని, నీటిపారుదల శాఖ మంత్రిని ఒప్పించి, సుప్రీంకోర్టు మెట్లెక్కి సెక్షన్-3ని సాధించిండ్రు. ఈ కారణంగానే 811 టీఎంసీలున్న కృష్ణాలో మనం 570 టీఎంసీల వాడకానికి మార్గం సుగమమైంది’అని వివరించారు. మెరుగైన వాదనల తో 70 శాతం వాటా తేవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం..
సమైక్యరాష్ట్రంలో తెలంగాణలో నీటి ప్రాజెక్టులు కట్టకుండా కాంగ్రెస్, టీడీపీలు చేసిన ద్రోహంతోనే నీళ్ల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందని హరీశ్ వివరించారు. అందుకే ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంచారని వివరించారు. ‘ఈ కేటాయింపులు తాత్కాలికం.. కోర్టులు, ట్రిబ్యునల్‌లో ప్రభావం చూపవు. భవిష్యత్తులో మీ హక్కుల కోసం కోర్టుల్లో కొట్లాడవచ్చు. నీటి పంపకాలు జరిగేవరకు మాత్రమే ఈ కేటాయింపులు’ అంటూ అదిత్యనాథ్ సంతకం చేసిన డ్యాక్యుమెంట్‌ను మీడియాకు చూపారు. ఆ తర్వాత కూడా 50 శాతం నీటి కేటాయింపులు చేయాలని కేంద్రానికి లేఖలు రాశామని గుర్తుచేశారు.
66:34 పంపకాలకు ఒప్పుకొన్న కాంగ్రెస్
కృష్ణా జలాల పంపిణీలో కేసీఆర్ అన్యా యం చేశారని అసత్యాలు చెప్తున్న కాంగ్రె స్ సర్కారు 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలకు ఎందుకు అంగీకరించిందని హరీశ్ ప్రశ్నించారు. ‘299 టీఎంసీలు చాలని 2025, ఫిబ్రవరి 17న సంతకం పెట్టి వచ్చారు.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా స్వయంగా చెప్పారు. మరిప్పుడు తెలంగాణకు గోరీ కట్టి వచ్చారా?’ అని నిలదీశారు. కేసీఆర్ సంతకం పెట్టారని దుష్ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నా యకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెసోళ్లు సెక్షన్-3 ఆధారంగా ట్రిబ్యునల్‌లో మెరుగైన వాదనలు వినిపించి కృష్ణాలో 570 టీఎంసీల నీటి వాటాను సాధించాలని డిమాండ్ చేశారు.
పోతిరెడ్డిపాడు పాపం కాంగ్రెస్‌దే
కృష్ణా నీళ్ల వాటా మాదిరిగానే పోతిరెడ్డిపాడు విషయంలోనూ కేసీఆరే కారణమని మొన్న అసెంబ్లీలో రేవంత్ అసత్యాలు చెప్పారని హరీ శ్ మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు జీవో ఇచ్చిననాడు కాంగ్రెస్‌తో తాము కలిసి లేమని సోదాహరణంగా వివరించారు. ‘2005, జూలై 4న మేం రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్ నుంచి బయటకు వచ్చినం. 2005, సెప్టెంబర్ 13న జీవో తెచ్చిండ్రు. పులిచింతల, పోతిరెడ్డిపాడుతో తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే పదవులను గడ్డిపోచల్లా విసిరేసినం. 200 5, అక్టోబర్ 3న వాయిదా తీర్మానం ఇచ్చినం. 40 రో జులు అసెంబ్లీని స్తంభిపజేసినం. నాడు పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి. మాతో కలిసివచ్చిం ది పీ జనార్దన్‌రెడ్డి మాత్రమే’ అని గుర్తుచేశారు.
సీమ లిఫ్ట్‌పై పోరాడింది కేసీఆరే
సీమ లిఫ్ట్ వద్దని పోరాడిన కేసీఆర్‌ను రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా బదనాం చేశారని హరీశ్ విమర్శించారు. ‘సీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో 2020, మే 5న వచ్చింది. బీఆర్ఎస్ అంతకంటే 4 నెలల ముందే అంటే 2020, జనవరి 29న ఈ ప్రాజెక్టును వ్యతిరేకించింది. ఈ ప్రాజెక్టు తెలంగాణకు గొడ్డలి పెట్టు అని అదే ఏడాది మే 12న కేంద్రానికి, సీడబ్ల్యూసీకి లేఖలు రాసినం. 2020, అక్టోబర్ 2న కేసీఆర్ స్వయంగా కేంద్ర మంత్రి షెకావత్‌కు ఉత్తరం రాశారు. రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపి శ్రీశై లం ప్రాజెక్టు నియంత్రణ బాధ్యతను తెలంగాణకు ఇవ్వాలని కోరారు. అక్టోబర్ 22న అఫెక్స్ కమిటీ మీటింగ్‌లోనూ గట్టిగా మాట్లాడారు. గ్రీన్ ట్రిబ్యునల్ మీద స్టే తెచ్చారు. ఆ ఫలితంగానే ఎన్విరాన్మెంట్ ఐడ్వెజరీ కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టును కూల్చేయాలని చెప్పింది’ అని ఆధారాలతో సహా వెల్లడించారు.
కేసీఆర్‌తోనే పాలమూరు పచ్చబడ్డది
కేసీఆర్‌ను మహబూబ్‌నగర్ నుంచి గెలిపిస్తే ఏం చేశారని రేవంత్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని హరీశ్ మండిపడ్డారు. పాలమూరు వలసల పాపం కాంగ్రెస్, టీడీపీలదేని ఫైర్ అయ్యారు. నాడు రాజశేఖర్‌రెడ్డి జలయజ్ఞాన్ని ప్రారంభించి ఆంధ్రా ప్రాజెక్టులను పరుగులెత్తించి పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టారని గుర్తుచేశారు. చంద్రబాబు కల్వకుర్తికి ఏడాదికి రూ.5 కోట్లు కేటాయించి ఖర్చుకూడా చేయలేదని మండిపడ్డారు.‘బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పాలమూరులోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకున్నం. రూ.4వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టుల వద్ద రాత్రింబవళ్లు కటికనేలపై నిద్రపోయి పనులు పూర్తిచేసి 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చి పాలమూరును పచ్చగ చేసినం. ఇందుకు నాతో కలిసి నిద్రించిన ప్రస్తుత మంత్రి జూపల్లి కృష్ణారావే సా క్ష్యం’ అని చెప్పారు. కానీ పాలమూరును దత్త త తీసుకున్న రేవంత్ గురువు సాగునీరు దెవుడెరుగు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని దెప్పిపొడిచారు. ‘కేసీఆర్ పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటికీ తాగునీరు ఇచ్చిండ్రు. అగ్రికల్చర్, ఐదు మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు, రోడ్లు నిర్మించిండ్రు. వేల ఎకరాలకు నీళ్లిచ్చిండ్రు’ అని వివరించారు. పాలమూరు గోస చెప్పుకొని ఒట్లు దొబ్బిన కాంగ్రెస్‌కు పాలమూ రు అభివృద్ధిపై మాట్లాడే హక్కు లేదన్నారు.
ఆర్డీఎస్ కోసం కేసీఆర్ పాదయాత్ర
నిజాం నవాబు ఆర్డీఎస్ కింద 87 వేల ఎకరాల కోసం ప్రాజెక్టు కడితే కాంగ్రెస్ పుణ్యాన 20 వేలకు వచ్చిందని హరీశ్ ధ్వజమెత్తారు. ‘ఆర్డీఎస్ కోసం కేసీఆర్ పాదయాత్ర చేశారు. నీళ్లు పారాల్సిన కాలువల్లో ముళ్ల కంచెలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నరు. మూడు నెలల్లో తుమ్మిళ్ల లిఫ్ట్ పూర్తిచేసి మళ్లీ ఆర్డీఎస్ కాలువల్లో 50 వేల ఎకరాల్లో నీళ్లు పారించారు. ఈ విషయం అలంపూర్ గద్వాల వాసులను అడిగితే చెప్తరు’ అని వివరించారు.
జూరాలలోఎత్తిపోతలు పెట్టాలట!
‘ఆదిత్యనాథ్ ఏం సలహాలిచ్చిండో తెలియ దు గాని.. 9 టీఎంసీలున్న జూరాలలో పాలమూరు ఎత్తిపోతలు పెట్టాలని అసెంబ్లీలో రేవంత్ అడ్డదిడ్డంగా మాట్లాడారు’ అంటూ హరీశ్ తూర్పారబట్టారు. ఇప్పటికే జూరాల సొంత ఆయకట్టు లక్ష ఎకరాలతో పాటు భీమా 2 లక్షలు, నెట్టెంపాడు 2 లక్షలు, కోయిల్‌సాగర్ 50 వేలు మొత్తంగా 5.50 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటదని పేర్కొన్నారు. ఇలాంటి జూరాలపై రోజుకు రెండు టీఎంసీలను పాలమూరు ఎత్తిపోతల ద్వారా ఎలా తీసుకుంటామో ముఖ్యమంత్రికే తెలియాలని అసహనం వ్యక్తంచేశారు. 215 టీఎంసీలున్న శ్రీశైలంను గురుదక్షిణ కింద చంద్రబాబుకు అప్పజెప్పి జూరాలను నిర్వీర్యం చేయాలనుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణకు నీళ్లు రాకుండా చేసినోడే రేవంత్ సలహాదారు
కేసీఆర్ కృష్ణా నీళ్లను ఆంధ్రప్రదేశ్‌కు రాసిచ్చారని..స్వయంగా ఆయనే సంతకం పెట్టారని రేవంత్‌రెడ్డి నోటికి హద్దూఅదుపూ లేకుండా మాట్లాడుతున్నారని హరీశ్ ఆక్షేపించారు. ‘తెలంగాణ ఏర్పాటు తర్వాత పంట కాలం మొదలైన వెంటనే నీళ్ల కోసం ఢిల్లీకి వెళ్లాం.. తెలంగాణ నుంచి ఎస్కే జోషి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆదిత్యనాథ్ దాస్ వచ్చారు. ప్రాజెక్టులు లేకుండా నీళ్లెట్ల వాడుకుంటారని తప్పుడు మాటలతో ఆదిత్యనాథ్ దాస్ అభ్యంతరం చెప్పారు. తప్పుడు సమాచారం ఇచ్చినందుకే ఆయనకు సుప్రీం కోర్టు పెనాల్టీ కూడా విధించింది. ఇప్పుడు తెలంగాణలో ఎవరూ లేరన్నట్టు తెలంగాణ నీళ్లను, నోరును కొట్టినోడినే రేవంత్‌రెడ్డి సలహాదారుగా పెట్టుకున్నాడు’అని నిప్పులు చెరిగారు.