CM Revanth Reddy | కరీంనగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/వేములవాడ: ‘ప్లేట్ భోజనం రూ.32 వేలు?’ శీర్షికన ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది. ప్లేటు భోజనానికి రూ.32వేలు ఖర్చయినట్టు బిల్లులు దేవాలయ అధికారులకు అందగా, అదే వేగంతో ఫర్నిచర్ కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ముఖ్యమంత్రి విడిది చేసే గెస్ట్‌హౌస్‌తోపాటు మంత్రులు విడిది చేసే చైర్మన్ అతిథి గృహంలోని మంచాల నుంచి సోఫాల వరకు ఆగమేఘాల మీద కొత్తవి కొనుగోలు చేశారు.
ఈ కారణంగానే ఖర్చు తడిసి మోపెడైనట్టు తెలుస్తున్నది. ఇది రాజన్న దేవాలయానికి భారంగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ఇంత ఖర్చు చేసినా ఏ ఒక్కరూ అక్కడ బసచేయలేదు. నిజానికి అక్కడ బస చేస్తున్నట్టు అధికారిక సమాచారం కూడా ఆలయ అధికారులకు అందలేదు. అయినా, ఈ ఫర్నిచర్ ఎందుకు కొనుగోలు చేశారన్న దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ‘ప్లేట్ భోజనం రూ.32 వేల’కు సంబంధించిన కథనంపై డీపీఆర్వో ద్వారా ఆలయ అధికారులు అస్పష్ట వివరణ ఇచ్చారు. అసలు భోజనాలకు రూ.32 లక్షలు ఖర్చు అయిందా.. లేదా..? అన్న అంశాన్ని పేర్కొనకుండా, కథనంలోలేని అంశాలకు వివరణ ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడుకు వచ్చారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ అతిథి గృహంలో సీఎంతోపాటు మంత్రులు, అధికారులు, ఇతర వీపీఐలకు ఏర్పాటు చేసిన భోజనానికి ప్లేట్‌కు రూ.32వేల చొప్పున ఖర్చు పెట్టిన విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలంటూ సోషల్‌మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. ఈ కథనంపై బీఆర్ఎస్, బీజేపీ భగ్గుమన్నాయి. సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశాయి. నిజానికి ఆరోజు ముఖ్యమంత్రి సభ మధ్యాహ్నం ఉన్నది. దానికి ముందుగానే సీఎంతోపాటు మంత్రులు కూడా వేములవాడకు చేరుకున్నారు. రాజన్న దర్శనం చేసుకొని, ఆ తర్వాత జరిగిన సభలో పాల్గొని అతిథులు వెళ్లిపోయారు. అధికారిక షెడ్యూల్లో ఎక్కడ దేవాలయ పరిధిలో బస చేస్తారని పేర్కొనలేదు.
కానీ, ఒక ఉన్నతాధికారి ఆదేశాల మేరకు హుటాహుటిన లక్షలు వెచ్చించి దేవాలయ అధికారులు కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి విడిదిచేసే ఎన్టీఆర్ గెస్ట్‌హౌస్‌లో వస్తువులన్నింటినీ మార్చారు. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి వచ్చిన సమయంలో.. కొన్ని మార్పులు చేయడం సహజమే అయినా ఇక్కడ అందుకు భిన్నంగా చేశారు. సీఎంతోపాటు మంత్రులు కూడా వస్తున్నారని మంత్రులు విడిది చేసే చైర్మన్ అతిథిగృహంలోని మంచాలు, సోఫాలు, పరుపులు, బెడ్షీట్లు చివరకు చేతులు కడుక్కునే వాష్బేసిన్లను కూడా మార్పు చేశారు. దీంతో బిల్లు ప్రస్తుతం తడిసి మోపడైంది. రూ.32 లక్షల భోజన బిల్లులు కాకుండా అదనంగా దేవాలయ పరిధిలో ఫర్నిచర్ కొనుగోలు, పట్టువస్ర్తాలు తదితర వాటికి సుమారు రూ.1.4 కోట్లు ఖర్చు అయినట్టు తెలుస్తున్నది. రెండూ కలిపి 1.7 కోట్లకుపైగా ఖర్చు అవడంతో రాజన్న దేవాయలంపై మోయలేనిభారం పడిందని దేవాలయ సిబ్బంది చర్చించుకుంటున్నారు.
‘ప్లేట్ భోజనం రూ.32 వేలు?’ కథనంపై సోమవారం సాయంత్రం దేవాలయ కార్యనిర్వహణ అధికారి పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లా డీపీఆర్వో ద్వారా ఒక ప్రకటన విడుదలైంది. దేవస్థాన అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం ముఖ్యమంత్రి గతనెల 20న వేములవాడకు వచ్చారని, ఆ సమయంలో భోజనాలు, ఇతర ఏర్పాట్ల గురించి నిధులు దుర్వినియోగం అయ్యాయంటూ వచ్చిన వార్త నిరాధారమని, సత్యదూరమైనదని, దేవాలయం నుంచి ఎటువంటి నిధుల చెల్లింపు చేయలేదని వివరించారు. దేవాలయ నిధులను దేవాదాయ, ధర్మదాయ శాఖ చట్టానికి లోబడి వినియోగిస్తామని, తప్పుడు కథనాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. రాజన్న ఆలయ సొమ్ము రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని, భవిష్యత్‌లోనూ చేయమని ఆ ప్రకటనలో తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రూ.32 లక్షలతో వంద మంది వీఐపీలకు భోజనాలు పెట్టారని, ప్లేట్ భోజనానికి రూ.32 వేలు ఖర్చు అయినట్టు చూపుతూ సదరు హోటల్ నిర్వాహకులు బిల్లులు పంపించారని, ఆ బిల్లులు దేవాలయం నుంచి చెల్లించడం సాధ్యం కాదని పేర్కొంటూ సంబంధిత అధికారులు కలెక్టర్‌కు ఫైలు పంపారని, ఈ విషయంలో కలెక్టర్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలన్న వివరాలను ‘నమస్తే తెలంగాణ’ కథనంలో నొక్కి చెప్పింది. భోజనాలు, ఫర్నిచర్ కొనుగోలు, ఇతర ఖర్చులు కలిపి రూ.1.7 కోట్లు అయిందని ‘నమస్తే తెలంగాణ’ తన కథనంలో పేర్కొన్నది. ఎక్కడా రాజన్న ఆలయ నిధులు దుర్వినియోగం ఆయ్యాయన్న పదం వాడలేదు.
భోజనాల ఖర్చు రూ.32 లక్షలు అయిందా.. లేదా..? హైదరాబాద్ నుంచి వచ్చిన హోటల్ నిర్వాహకులు బిల్లులు పంపించారా.. లేదా? బిల్లులు దేవాలయం నుంచి చెల్లిస్తారా? లేక కలెక్టర్ ఖాతా నుంచి చెల్లిస్తారా? ప్లేట్ భోజనం అన్నీ ఖర్చులు కలుపుకొని హోటల్ నిర్వాహకులు ఇచ్చిన బిల్లుల ప్రకారం రూ.32 వేలు పడిందా.. లేదా? అనే అంశాలపై దేవాలయ కార్యనిర్వహణ అధికారి పేరిట జారీ చేసిన ప్రకటనలో వివరించకపోవడం గమనార్హం.
నిజానికి, ‘నమస్తే తెలంగాణ’ కథనం తప్పయితే భోజనాలకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా దేవాలయ శాఖ నుంచి నిధులు చెల్లించలేదంటూ వివరణలో చెప్పారు. కలెక్టర్-దేవాదాయ శాఖ మధ్య పంచాయితీ నడుస్తున్నదని కథనంలో స్పష్టంగా ఉన్నప్పుడు నిధులు చెల్లింపు ప్రస్తావన ఎలా వస్తుందో వివరణ జారీ చేసిన అధికారులకే తెలియాలి. రూ.1.4 కోట్లతో ఫర్నిచర్ కొనుగోలు చేశారని, బెడ్స్ మొదలుకొని అన్నీ మార్చారని, కథనంలో పేర్కొన్న అంశాలపై అధికారులు వివరణ ఇవ్వలేదు. దీంతో అధికారులు దాటవేసేందుకు దారులు వెదుక్కుంటున్నారన్న అభిప్రాయం కలుగుతున్నది.