Revanth Reddy | సిద్దిపేట, మార్చి 22( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం రేవంత్‌రెడ్డి రైతు సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. తమది రైతు ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్.. ఆ రైతులపైనే వివక్ష చూపటంపై అన్నదాతల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ఆదివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఏర్పాటుచేసిన సభను బయటి జిల్లాల రైతులతోనే జరుపడంపై మండిపడుతున్నారు. సిద్దిపేట ప్రాంత రైతులను అనుమతించకుండా కేవలం మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల నుంచి తెచ్చుకున్న జనంతో సీఎం రేవంత్‌రెడ్డి సభ నిర్వహించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌ను మాత్రమే అనుమతించారు. ఏఈవోలకు టార్గెట్ పెట్టి మరీ రైతులను సభకు తరలించగా, ప్రతి బస్సుకు సివిల్ డ్రెస్‌లో పోలీసులు కాపాలా కాశారు. హామీలపై రేవంత్‌రెడ్డిని ఎక్కడ నిలదీస్తారోనని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సీఎం మాట్లాడుతుండగానే రైతులు వెళ్లిపోగా, ప్రసంగాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
అబద్ధాలను కూడా అద్భుతంగా చెప్పగలను అని నర్మెట సభలో సీఎం మరోసారి రుజువు చేసుకున్నాడు. కేసీఆర్ పదేండ్ల పాలన ఎట్లుండె? ఈ 27 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో రైతులు బేరీజు వేసుకున్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నామని రైతులు నిక్కచ్చిగా చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని సభకు వచ్చిన రైతులు ముచ్చటించుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని రైతులు తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కష్టాలను ఏనాడూ పట్టించుకోకుండా.. ఇవ్వాళ ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు’ అని మాట్లాడటం కాంగ్రెస్ ప్రభత్వానికి సరిగ్గా సూట్ అవుతుందని రైతులు నొక్కిచెప్పారు. రైతుభరోసా లేదు.. రుణమాఫీ లేదు. రైతులను ఏం ఉద్ధరించావంటూ అసహనంతో రైతులు సభ నుంచి వెళ్లిపోయారు.
సభలో గ్యాలరీలు రైతులు లేక ఖాళీగా కనిపించాయి. మంత్రుల ప్రసంగాలతో విసిగిపోయిన రైతులు.. ముఖ్యమంత్రి స్పీచ్ మొదలుపెట్టగానే రైతులు ఒక్కొక్కరుగా వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలకు రేవంత్‌రెడ్డి తన ప్రసంగం ఇవ్వాల్సి వచ్చింది. సభకు వచ్చిన వారంతా సిద్దిపేట కాకుండా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన రైతులు. ‘రైతు భరోసా వేస్తా అని చెప్పారు. ఇవ్వాళ ఒక్క ఎకరం వేసిండు. మిగతావి నాలుగు విడతలు వేస్తా అంటుండు. వచ్చేదెంతో రానిది ఎంతో? ఇలా ఎన్నోసార్లు చెప్పిండు. రేపు వేస్తా అన్న గ్యారెంటీ లేదు’ అంటూ రైతులు నిట్టూర్చుతూ బయటికి వెళ్లిపోయారు.

సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న సభా ప్రాంగణంలోకి పోలీసులు అనుమతించకపోవడంతో వాటర్ బాటిళ్లను బయటే పడేసి వెళ్తున్న జనం
సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలాన్ని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఫ్యాక్టరీ ఉన్న నర్మెట గ్రామంలో గట్టి బందోబస్తు పెట్టారు. అనుమతి లేకుండా ఎక్కడి వెళ్లినా కేసులు పెట్టి స్టేషన్‌కు తరలిస్తామంటూ బెదిరించారు. పోలీసుల ఓవర్‌యాక్షన్‌తో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో నిరసన తెలుపుతారన్న భయంతో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నమల్ల రాములు, నాయకుడు రాజు, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డిని ముందస్తుగా అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. ఆశావర్క్ర్లను అదుపులోకి తీసుకున్నారు.
సిద్దిపేట శాసనసభ ఎన్నికల్లో గెలిచిపించిన ఎమ్మెల్యేను మంత్రిని చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. నర్మెటలో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ 2029లో మళ్లీ అధికారం తమదేనని, వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత తమ మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నాని ప్రకటించారు. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. తాను వివక్ష చూపను.. తనది వివక్ష చూపే తత్వం కాదన్నారు. తాము పేదల కోసం పనిచేస్తానని చెప్పారు.