హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సింగపూర్, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్‌రెడ్డి కట్టుకథలు చెబుతున్నారని మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎండీసీ) మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా రు. దావోస్ టూర్‌ను బోగస్‌గా మార్చి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు. మన దేశం, మన రాష్ట్రానికి చెందిన కంపెనీలతో విదేశాలకు వెళ్లి ఒప్పందా లు చేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. గొప్పల కోసమే తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. గతంలో దా వోస్ పెట్టుబడులపై రేవంత్, ఉత్తమ్, భట్టి మా ట్లాడిన వీడియోలను చూపుతూ కాంగ్రెస్ సర్కా రు వైఖరిని కడిగిపారేశారు. ‘నాడు పెట్టుబడులతో ఒరిగేదేమీ ఉండదని.. కంపెనీలకే లాభం తప్ప, ప్రజలకు మేలేమీ లేదని చెప్పిన రేవంత్.. ఇప్పుడు రూ.1.78లక్షల కోట్ల పెట్టుబడులం టూ ఊదరగొడుతున్నారు’ అని దుయ్యబట్టారు.
గతంలో ఇస్టిండియా కంపెనీతో పోల్చిన మేఘాతో ఇప్పుడు ఒప్పందం ఎందుకు చేసుకున్నారు? అది యూరోప్ కంపెనీగా భావించి అక్కడే అగ్రిమెంట్ చేసుకున్నారా? అంటూ ఎద్దేవాచేశారు. దావోస్ పెట్టుబడులతో లాభంలేదని పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్, ఎక్స్పేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని భట్టి చెప్పిన విషయాలను గుర్తుచేశారు. నిరుడు కుదుర్చుకున్న 40 వేల కోట్ల పెట్టుబడుల్లో ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి రాలేదని పేర్కొన్నారు. దావోస్‌లో లేని సన్ సంస్థ ఎండీతో అగ్రిమెంట్ చేసుకున్నామని సీఎం పచ్చి అబద్ధం చెప్పారని, సీఎం ఇలా వ్యవహరించవచ్చా? అని నిలదీశారు. సన్ ఎండీ దిలీప్సంఘ్వీకి బదులు వేరే వ్యక్తితో సీఎం దిగిన ఫొటోలను ప్రధాన పత్రికలో ప్రచురితం చేయడం సబబు కాదన్నారు.
పాకిస్థాన్‌కు చెందిన సంస్థ మెయిన్ హార్ట్‌కు మూసీ సుందరీకరణ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు సీఎం కుట్రలు చేస్తున్నారని క్రిశాంక్ ఆరోపించారు. ఆ సంస్థ ఎండీతో సమావేశం కావడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. బోగస్ కంపెనీలతో అగ్రిమెంట్ల పేరిట ప్రగల్భాలు పలుకుతున్న సీఎం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మాటలు కట్టిపెట్టి వాస్తవాలు చెప్పాలని హితవు పలికారు.
ఇప్పటివరకు విద్యుత్తు పాలసీ రూపొందించలేదని ఆ శాఖ మంత్రి భట్టి విక్రమార్క చెప్తుంటే సీఎం మాత్రం పంప్డ్ స్టోరేజీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని అసత్యాలు వల్లెవేస్తున్నారని క్రిశాంక్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి డాటా సెంటర్లు వస్తున్నాయంటే కేసీఆర్ పాలనే కారణమని చెప్పారు. కానీ, రేవంత్ ఆయన పేరు పలికేందుకు నామోషిగా భావించడం బాధాకరమని పేర్కొన్నారు.