Musi Project | హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : లక్షల కోట్ల ప్రాజెక్టు.. వేలమంది నిర్వాసితులు, అయినా రెవెన్యూ నుంచి పట్టణాభివృద్ధిశాఖ వరకు ప్రధాన శాఖలన్నీ సీఎం రేవంత్‌రెడ్డి కలల మూసీ ప్రాజెక్టు కోసం పరితపిస్తున్నాయి. వివరాలను గోప్యం గా ఉంచుతున్న అధికారులు ప్రాజెక్టు పురోగతిపై చర్చించకుండానే గుట్టుగా వ్యవహారాలు నడిపిస్తున్నారు. అయినప్పటికీ ఏదోరకంగా ఈ బాగోతాలన్నీ సోషల్ మీడియా ద్వారా వె లుగులోకి వస్తూనే ఉన్నాయి. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఎజెండాను ఎత్తుకున్నప్పటి నుంచే వివాదం ప్రారంభమైంది. అయినప్పటికీ ప్రాజెక్టును పూర్తిచేసి తీరాలనే ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. ఇందుకోసం ఏర్పాటు చేసిన మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీడియాకు చిక్కకుండా వ్యవహారాలు చక్కబెడుతున్నది. ఇప్పటికీ నోటీసులు అందుకుంటున్న మూసీ పరీవాహక ప్రజలు కోర్టు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు. లక్ష కోట్ల ప్రజాధనంతో ప్రాజెక్టులు చేపడుతున్నప్పుడు పారదర్శకత అవసరం. కానీ, ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టును గోప్యంగా చేపట్టాలని చూస్తుండటంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇండ్ల కూల్చివేతలతో విమర్శలు రావడంతో ప్రాజెక్టును గుట్టుచప్పుడు కాకుండా పూర్తిచేయాలని అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ అయినట్టు తెలిసింది. ఉన్నతాధికారుల వివరణ కోరితే దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు.
ఏమాత్రం రాజీలేకుండా మూసీ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్తుంటే, అధికారులు మాత్రం పనులు జరగడం లేదని చెప్తున్నారు. డిజైనింగ్ బాధ్యతలు అందుకున్న మెయిన్‌హార్ట్ కంపెనీ అంతర్గతం గా సమావేశాలు నిర్వహిస్తున్నది. ‘సేవ్ మూ సీ’ పేరిట ఆందోళనలు చేస్తున స్వచ్ఛంద సం స్థలు కూడా ఈ విషయమై ఆరోపణలు చేస్తున్నాయి. తొలి దశలో 23 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తు న్నా, ప్రాజెక్టు డిజైనింగ్‌లో ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారనే కీలకమైన విషయాలను కూడా గోప్యంగా ఉంచడం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది.