CM Revanth Reddy | హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ) : తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. సాక్షాత్తూ సీఎం హోదాలో స్వరాష్ట్రంపై ఆయన విషం చిమ్మారు. ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం’ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాభవన్‌లో ఆదివారం జరిగిన రాజీవ్ సివిల్స్ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్సీ మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు సింగరేణి సంస్థ సాయంతో ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసమే యువత తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నారని తెలిపారు. కానీ, రాష్ట్రంలో పరిస్థితులను చూస్తుంటే ఉమ్మడి ఏపీ కంటే ప్రత్యేక తెలంగాణలోనే ఎక్కువ అన్యాయం జరిగినట్టు అనిపిస్తున్నదని చెప్పారు.
మార్చి 31లోపు నియామకాలు
మార్చి 31లోపు గ్రూప్-1 నియామకాలను పూర్తిచేయనున్నట్టు సీఎం వెల్లడించారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలకు హాజరయ్యే ప్రతిఒక్కరూ సివిల్స్‌లో ఎంపిక కావాలని ఆకాంక్షించారు. సీఎస్ శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం, ఎమ్మెల్యేలు వివేక్, కనకయ్య, యాదయ్య, సత్యనారాయణరావు, విజయరమణారావు, కూనంనేని సాంబశివరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సింగరేణికి రూ.1.25 కోట్ల బీమా
సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా అందనున్నది. బ్యాంక్ ఆఫ్ బరోడాతో సింగరేణి సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సీఎండీ బలరాం, బ్యాంక్ అధికారులు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఇటీవల మరణించిన సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు కోటి ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు. సింగరేణి సీఎండీ ఎన్ బలరాం నాయక్‌పై సీఎం రేవంత్ ప్రశంసలు కురిపించారు. ‘బలరాం నాయక్ ఓ గిరిజన యువకుడు. పుస్తకం కొనేందుకు రూ.50 కోసం ఛే నంబర్ చౌరస్తాలో కూలీగా పనిచేసి, ఐఆర్ఎస్ అధికారి అయ్యారు. సింగరేణి సీఎండీ వరకు ఎదిగారు. కష్టం.. కమిట్మెంటే అందుకు కారణం’ అని బలరాం నాయక్ ప్రస్థానాన్ని సీఎం వివరించారు.