HCU | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): హెచ్‌సీయూలో సీఎం రేవంత్‌రెడ్డి సర్కారు సాగించిన విధ్వంసపు ఆనవాళ్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. బుల్డోజర్లు దూసుకువస్తుంటే మూగజీవాలకు అంతుపట్టలేదు. గుట్టకొకటి, పుట్టకొకటిగా పరుగులు తీశాయి. వంద ఎకరాల వనం… మైదానమైపోయింది. తమ ఆవాసాల ఆనవాళ్లు కూడా కనిపించకపోవడంతో హరిణాల వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు సాగించిన పరుగులో కుక్కల దాడిలో జింకలు ప్రాణాలు విడిచిపెట్టాల్సి వస్తున్నది.
జింక కూన ప్రాణం తీసిన కుక్కలు!
ఇదిగో ఈ కూన జింకను ఒక్కసారి చూడండి. రెండుగా చీలిన ఆ దేహాన్ని కండ్లారా చూడండి. ఎంత వేదన అనుభవించి ఆ జీవి తన ప్రాణాలను వదిలిందో కదా! బుల్డోజర్ల కింద వాటి గూడు నలిగిపోతే.. ఈ కూన ప్రాణభయంతో పరుగుపెట్టింది. కుక్కలు ఆ జింకపై దాడి చేశాయి. ఒళ్లు గగుర్పొడిచేల ఆ కూనను తీవ్రంగా కరిచాయి. దేహాన్ని రెండుగా చీల్చాయి. ఈ దాడిలో కూన అక్కడికక్కడే మరణించింది. ఈ విషాదం శనివారం హెచ్‌సీయూలో బయటపడింది. రెండుగా చీలి ఉన్న జింక దేహాన్ని చూసిన వారందరి గుండె తరుక్కుపోతున్నది. కూన మృతదేహాన్ని యూనివర్సిటీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎన్ని మూగజీవాల ప్రాణాలు పోవాలని పర్యావరణ, జంతు ప్రేమికులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
సర్కార్ మరో విధ్వంస రచన!
వెలకట్టలేని పచ్చదనాన్ని నేలకూల్చిన ప్రభు త్వం అదంతా ఒట్టిదేనని అంటున్నది. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు. కానీ హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వందల బుల్డోజర్లతో వేలాది చెట్లను నేలకూల్చి, మూగజీవాలను చెల్లాచెదురు చేసిన వైనాన్ని నివేదిక రూపంలో సుప్రీంకోర్టుకు సమర్పించారు. అంటే రిజిస్ట్రార్ నివేదికను సైతం తప్పుపట్టే రీతిలో సీఎం ప్రకటన ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు హెచ్‌సీయూలో కుక్కల దాడిలో జింకలు చనిపోవడటం కొత్తేమీ కాదని… ఏటా 30-40 జింకలు చనిపోతాయని ప్రభుత్వ, కాంగ్రెస్ అనుకూల సామాజిక మాద్యమాల్లో ప్రచారం జరుగుతున్నది. గతంలోని పత్రికల క్లిప్పింగులను వైరల్ చేస్తున్నారు. ఇదంతా సెల్ఫ్‌గోల్ అని హెచ్‌సీయూ విద్యార్థులు చెప్తున్నారు. అంటే 400 ఎకరాల పరిధిలో జింకలు ఉన్నాయని వారే అంగీకరిస్తున్నారని, కానీ అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం జింకలేవీ లేవు… గుంట నక్కలు ఉన్నాయని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.