హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. తన నాలుకను తానే తెగ్గోసుకున్నారు. అసెంబ్లీ వేదికగా మరోసారి బూతుభాషను ఆశ్రయించారు. రోత మాటలతో అసెంబ్లీలో మురుగు పారించారు. జవాబుదారీతనం ప్రదర్శించాల్సిన చోట బజారు భాషకు మోకరిల్లారు. విలువల వలువలను అవలీలగా విప్పి పాతరేశారు. గత నెల 24న కొడంగల్ బహిరంగసభలో కేసీఆర్ చావును కోరారు. కేటీఆర్‌ను ఉద్దేశించి ‘నీయవ్వ…నీయమ్మ’ అని రెండు మూడుసార్లు అనేశారు. హరీశ్‌రావును ‘నల్లికుట్లోడు’ అంటూ కంట్లో నిప్పులు పోసుకున్నారు. తండ్రి వయసున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, దేశవ్యాప్తంగా తమ పనితీరుతో తెలంగాణకు వన్నెతెచ్చిన ఇద్దరు మాజీ మంత్రులపై బాధ్యతాయుత సీఎం స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డి చేసిన జుగుప్సాకరమైన ఆ దుర్భాషపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అది బహిరంగసభ జనం ఈ లలు.. కేరింతలు కొడుతున్న సందర్భంలో అయినా సరే పట్టుతప్పి మైక్ ముందు మైకం పూనినట్టు వ్యవహరించడం దారుణమని, ఆ వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమైనవని విజ్ఞులు తేల్చిచెప్పారు. తాజాగా శనివారం ప్రజాస్వామ్య విలువలకు పట్టంగట్టాల్సిన అసెంబ్లీ సభావేదిక సాక్షిగా పరుషమైన, జుగుప్సాకరమైన, హేయమైన పదాలను అవలీలగా ఒకటికి రెండుసార్లు ‘ఇట్లనే అంట.. నా నోరే ఇం తే’ అన్నట్టుగా వాడేశారు. ‘భడివోవేఁకో.. కోన్ సంభాల్నా..’ ఒకవేళ తిట్టుగా వాడాల్సిన చోట వాడటానికి కూడా వాడకూడని పదం ‘భడివే’ అని అవలీలగా తిట్టేశారు. సీఎం అలా గాలిపీల్చి వదిలినంత సులువుగా అటువంటి బూతు ప్రయోగాన్ని తానో ప్రాజెక్టు నిర్మిస్తున్నానన్నంత పట్టుదలగా పేల్చారు. సభలో ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ తలపట్టుకున్నారు. ఆయన పక్కనే ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పగలబడి నవ్వుకున్నారు.
సీఎం తీరుపై విమర్శల వెల్లువ
సభా నాయకుడు ఇష్టారీతిగా నోరుపారేసుకోవచ్చు అన్నట్టుగా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇటీవల తన పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అన్యాయం జరిగితే ఊరుకోం… అధికార పక్షానికి కావాల్సినంత సమయం ఇ చ్చాం. ఇక అడిగేస్తాం.. కడిగిపారేస్తాం.. అవసరమైతే బాధ్యతాయుత ప్రతిపక్షంగా తోలుతీస్తాం.. అని హెచ్చరించారు. తాను ప్రజల పక్షాన నిలబడతామని ప్రకటించా రు. అయితే, ఆ మాటకు సీఎం రేవంత్‌రెడ్డి అదే రాజకీయ వేదికపై అంతే తీవ్రతతో స్పందిస్తే దాన్ని రాజకీయంగా బదులిచ్చారని అనుకుంటారు. కానీ, అసెంబ్లీ వేదికగా ఆ మాటంటే తోలుతీస్తా అంటే ‘నాలుక కోసేస్తా’ అని సీఎం రేవంత్‌రెడ్డి సభా నాయకుడిగా ఉండి నేరభాషను ఆశ్రయించడం.. దిగజారుడుతనానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ ముఖ్యమంత్రీ ఇలా మాట్లాడలే..
ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇంత జుగుప్సాకరంగా మాట్లాడిన సీఎంలు దేశచరిత్రలో ఇప్పటి వరకు లేరు.. భవిష్యత్తులో ఉండకూడదని విజ్ఞులు ఆశిస్తున్నారు. రేవంత్‌రెడ్డి బూతు పురాణంపై ప్రతి ఒక్కరూ హతాశులవుతున్నారు. విలువలను పాదుకొల్పాల్సిన వేదికపై విధ్వంసకర భాషను వినియోగించడం సరికాదని రాజకీయ పండితులు హితవు చెప్తున్నారు. బాధ్యతాయుత స్థానంలో ఉన్న నాయకుడు తాను మాట్లాడుతున్నది నాలుగు గోడల మధ్యనా, బహిరంగ ప్రదేశంలోనా? రాజకీయ వేదికా? ప్రభుత్వ వేదికా? అసెంబ్లీనా అన్న తేడా లేకుండా మాట్లాడటం అతని దయనీయ సంస్కృతికి అద్దంపడుతుందని అభిప్రాయపడుతున్నారు.
అధ్యక్షా.. సభా నాయకుడైతే ఏదైనా మాట్లాడొచ్చా?
‘ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇయ్యా’ అని సభాపతి తేల్చిచెప్పిన తెల్లారే చోటుచేసుకున్న పరిణామం సర్వత్రా చర్చనీయాంశమైంది. సభా నాయకుడిగా సీఎం రేవంత్‌రెడ్డి అప్రజాస్వామిక భాషను సభలో అవలీల గా ప్రయోగిస్తున్నప్పుడు సభాపతి వారించాల్సి ఉండేదని సీనియర్ శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారు. సభానాయకుడు సహా సభలో ఉన్న ప్రతి సభ్యుడు సభాపతికి సమానమేనని, అవే విలువలు సభాపతి పాటిస్తారని, ఇటీవల కాలంలో సభాపతు లు అలా వ్యవహరిస్తున్నారా? లేదా? అన్నది చర్చనీయాంశం కావడం విచారకరమని గతంలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన మాజీ సీనియర్ శాసనసభ్యులు అభిప్రాయపడ్డారు.